-“ప్రభావిత జిల్లాల్లో ప్రసవానికి దగ్గర్లో 7,871 మంది గర్భిణులు ఉన్నట్లు గుర్తింపు
-ఆసుపత్రులకు 375 మంది తరలింపు
-వైద్య శిబిరాల నిర్వహణకు కూడా సిద్ధం!
-ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దిత్వా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా రానున్న 15 రోజుల్లో ప్రసవానికి దగ్గర్లో ఉన్న గర్భిణుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తుపాన్ ప్రభావిత జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, కడప, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాల్లో వచ్చే 15 రోజుల్లో ప్రసవానికి అవకాశం ఉన్న వారు 7,871 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిని ముందు జాగ్రత్తగా సమీపంలోని ఆసుపత్రులకు తరలించే ప్రక్రియ మొదలైంది. ఆదివారం రాత్రికి 375 మంది గర్భిణులు ఆసుపత్రులకు చేరుకున్నారని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ఓ ప్రకటనలో తెలిపారు. మిగిలిన వారు కూడా ఆసుపత్రులకు రావాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు. దిత్వా తుపాన్ ప్రభావిత పది జిల్లాల్లోని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో విద్యుత్తు సరఫరాకు అవరోధం లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఆసుపత్రులు సూపరింటెండెంట్లకు కమిషనర్ సూచించారు.
వైద్య శిబిరాల నిర్వహణ
దిత్వా తుఫాన్ ప్రభావానికి అనుగుణంగా వైద్య శిబిరాల నిర్వహణకు కూడా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా tele conference dwara ‘దిత్వా’ తుపాన్ సన్నాహాక ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ రూములో ఇతర శాఖల వారితోపాటు వైద్య ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు కూడా ఉంటున్నారు.
Prajavartha Online Telugu News