విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యం గర్భస్థ శిశువు శారీరక, మానసిక, మేథో వికాసంపై అత్యంత ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యకరమైన బిడ్డకు తల్లి సంపూర్ణ ఆరోగ్యమే మూలం” అని ప్రముఖ గైనకాలజిస్ట్ డా|| కొల్లి శ్రీనయన పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హెూమ్లో డా॥సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని “గర్భస్థ శిశువుపై తల్లి ఆరోగ్య ప్రభావం” అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలో పోషకాహార లోపం, రక్తహీనత, మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు ఉంటే గర్భస్థ శిశువు తక్కువ బరువు, నెలలు నిండకుండా ప్రసవం. జన్మత లోపాలు, మేథో లోపాలతో పుట్టే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా గర్భధారణ మొదటి మూడు నెలలు పిండం అవయవాల నిర్మాణానికి అత్యంత సున్నితమైన సమయం అన్నారు. ఆ సమయంలో తల్లి తీసుకునే ఆహారం, మందులు, మానసిక ఒత్తిడి, పొగ తాగడం, మద్యం సేవించడం అలవాట్లు శిశువు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం అలవాట్లతో శిశువు గుండె, మెదడు, ముఖ ఆకృతిలో లోపాలు ఏర్పడే అవకాశం ఎక్కువ అన్నారు. మానసిక ఒత్తిడి, డిప్రషన్, ఆందోళన వంటి సమస్యలకు తల్లి గురైతే శిశువు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం తప్పదన్నారు. అందుకని గర్భిణీ స్త్రీకి కుటుంబసభ్యుల సహకారం, భావోద్వేగ మద్దతు ఎంతో ముఖ్యమన్నారు. ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్లతో కూడిన పోషకాహారం తగిన మోతాదులో తీసుకుంటే శిశువు శరీర, మేథో వికాసం మెరుగ్గా ఉంటుందన్నారు. క్రమం తప్పకుండా గర్భిణీ వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించుకోవచ్చన్నారు. తల్లి ఆరోగ్యంపై చూపే శ్రద్ద తన సంరక్షణ కోసమే కాకుండా ఆరోగ్యకరమైన భావితరం కోసమని గుర్తించాలన్నారు. అందుకని ప్రతి స్త్రీ గర్భధారణకు ముందే గర్భిణీ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం సమాజశ్రేయస్సుకు ఎంతో అవసరమని, ప్రతి స్త్రీ బాధ్యతగా భావించాలని అన్నారు. తల్లి మెరుగైన ఆరోగ్యంతో ఆరోగ్యవంతమైన శిశువు తద్వారా సంపూర్ణ ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు. సదస్సులో పాల్గొన్న పలువురి ప్రశ్నలకు ఆమె సందేహ నివృత్తి చేసారు.
Prajavartha Online Telugu News