Breaking News

వుడ్ కార్వింగ్ కళాకారులకు ఆధునిక టూల్ కిట్లు పంపిణీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల పరిరక్షణ, అభివృద్ధి దిశగా కీలకమైన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మాధవమాల వుడ్ కార్వింగ్ కళాకారులకు ఆధునిక టూల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత & వస్త్ర శాఖ మంత్రి (Minister of Handlooms & Textiles, Government of Andhra Pradesh) సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో హస్తకళా అడ్వైసర్ సుచిత్ర ఏళ్ళ , ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, హ్యాండీక్రాఫ్ట్స్ వైస్ చైర్మన్ విశ్వ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర చేనేత & వస్త్ర శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హస్తకళలు, చేనేతలు, సంప్రదాయ కళల పరంగా విశిష్టమైన చరిత్ర ఉందని, దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా రాష్ట్ర కళలకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి ప్రాంతం కళంకారి వస్త్రం, వుడ్ కార్వింగ్ వంటి సంప్రదాయ కళలకు కేంద్రబిందువుగా నిలిచిందని పేర్కొన్నారు. ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ పథకం కింద రాష్ట్రంలోని అనేక హస్తకళలను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఆధునిక యంత్రాల ఉత్పత్తులు, తక్కువ ధరల దిగుమతుల కారణంగా కొన్ని సంప్రదాయ కళలు క్రమంగా కనుమరుగవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులకు అవసరమైన పనిముట్లు అందించడం, వారి ఉత్పత్తులకు లాభదాయకమైన మార్కెట్ కల్పించడం ద్వారానే ఈ కళలను పునరుజ్జీవింపజేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరియు నారా లోకేష్ మార్గదర్శకత్వంలో హస్తకళల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, హస్తకళలు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిన అమూల్యమైన వారసత్వమని అన్నారు. రాష్ట్రంలో హస్తకళలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం తమ సంకల్పమని స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం, అలాగే రాష్ట్ర చేనేత & వస్త్ర శాఖ మంత్రి సవిత సహకారం ఎంతో కీలకమని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తకళలు, చేనేతలను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలుగా గుర్తించి, కళాకారుల సంక్షేమం కోసం స్పష్టమైన దిశానిర్దేశం అందిస్తున్నారని హరిప్రసాద్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కళాకారుల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వారికి న్యాయం జరిగేలా నిరంతరం తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. మంత్రి సవిత హస్తకళల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి విధానపరమైన సహకారం అందిస్తున్నారని వివరించారు.

ఈ ముగ్గురు నాయకుల సహకారంతో రాష్ట్రంలో హస్తకళలను కేవలం సంప్రదాయ పరిరక్షణ స్థాయిలో కాకుండా, లాభదాయకమైన ఉపాధి రంగంగా, జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే స్థాయికి తీసుకెళ్లేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని హరిప్రసాద్ తెలిపారు. కళాకారులకు అవసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాలు, ఆధునిక పనిముట్లు, మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ హస్తకళలను రాష్ట్ర గౌరవంగా నిలిపేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి కళంకారి వస్త్రాన్ని ప్రతి ఇంట్లో ఉండే స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో తాను కృషి చేస్తానని తెలిపారు. కళంకారి వస్త్రం శ్రీకాళహస్తి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందని, ఇది తరతరాలుగా కొనసాగుతున్న అపూర్వమైన వారసత్వ కళ అని అన్నారు. శ్రీకాళహస్తి మొత్తం కళంకారి కళ రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మార్కెటింగ్, ప్రచారం, ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. హరిప్రసాద్ కృషి, పట్టుదల వల్ల హస్తకళల రంగంలో గణనీయమైన మార్పు కనిపిస్తోందని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ఢిల్లీలో రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయ స్థాయి అవార్డులు పొందిన కళాకారులను మంత్రి సవిత, హస్తకళా అడ్వైసర్ సుచిత్ర ఏళ్ళ, హ్యాండీక్రాఫ్ట్స్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, హ్యాండీక్రాఫ్ట్స్ వైస్ చైర్మన్ విశ్వ శ్రీ కాళహస్తి చైర్మన్ కొట్టె సాయి కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం హాజరైన కళాకారులకు టూల్ కిట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, లేపాక్షి డైరెక్టర్లు, హస్తకళా అధికారులు, కళాకారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, హస్తకళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హస్తకళల పరిరక్షణ, అభివృద్ధి, కళాకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అవకాశాన్ని వినియోగిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *