విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత మాజీ ప్రధాని, ఆధునిక భారత ఆర్థిక సంస్కరణల శిల్పి పాములపర్తి వెంకట నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ కలపటపు బుచ్చిరాంప్రసాద్ ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించారు. గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లో మంగళవారం ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక పటంలో బలమైన దేశంగా నిలబెట్టిన దూరదృష్టి గల నాయకుడు పీవీ నరసింహారావు అని కొనియాడారు. పాండిత్యం, పరిపాలనా నైపుణ్యం, వినయం ఈ మూడు లక్షణాలు పీవీ నరసింహారావు వ్యక్తిత్వానికి ప్రతీకలని, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలపై ఆయనకు ఉన్న అపారమైన అవగాహన తరతరాలకు ఆదర్శమని తెలిపారు. పీవీ నరసింహారావు ఆశయాలు ఈనాటికీ దేశాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, ఆ మహానేతను స్మరించుకోవడమే కాక ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగడమే మనమందరం చేయాల్సిన నిజమైన నివాళి అని కలపటపు బుచ్చిరాంప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, బ్రాహ్మిన్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News