-బొర్రపోతుపాలెం గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర..
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, అభాగ్యులకు సకాలంలో పింఛన్లు అందించి ఆదుకుంటోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
బుధవారం ఉదయం మంత్రి మచిలీపట్నం మండలం బొర్రపోతుపాలెం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి గ్రామానికి చెందిన కతిక వెంకాయమ్మకు వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలు, బుద్దే స్వప్నకు వికలాంగు పింఛన్ రూ.6 వేలు అందించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి తేదీన పింఛన్లు అందిస్తున్నామన్నారు. మొదటి తేదీన ఆదివారం లేదా పండుగ వస్తే గనక లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఒకరోజు ముందుగానే అందిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ముందు రోజే పింఛన్లు అందించామని సంతోషంగా పండుగ జరుపుకోవాలని మంత్రి కాంక్షించారు.
రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నామని, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంలో దాదాపు రూ.50 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో 2.34 లక్షల మంది పింఛనుదారులకు దాదాపు రూ.102 కోట్లు అందించామన్నారు. వృద్ధాప్య పింఛన్ రూ.4వేలు, వికలాంగులకు రూ.6 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు, డయాలసిస్ ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10వేలు పింఛన్లు అందించి అభాగ్యులను ఆదుకుంటున్నామన్నారు. గతంలో రూ.200 ఉన్న పింఛన్ ను రూ. 2వేలు, తర్వాత రూ.3వేల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచి అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కార్యక్రమంలో సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) ఛైర్మన్ బండి రామకృష్ణ, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), మాజీ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ అథారిటీ డైరెక్టర్ లంకే నారాయణ ప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, కూటమి నాయకులు వన్నెం సునీల్, కుంభం రామస్వామి, యలకుర్తి విష్ణు, సాయిరాం, మాదివాడ రాము, గడ్డం రాజు, మధుసూదన్ రావు, సోమశేఖర్, సిహెచ్ఓ అన్నామణి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News