Breaking News

O&M విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
O&M విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీనగర్‌లోని విజయవాడ ప్రెస్ క్లబ్‌లో డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఏపీసీపీడీసీఎల్ మాజీ డైరెక్టర్ బి. జయ భరత్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని బి. జయ భరత్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా, అనంతరం బొండా ఉమా మహేశ్వరరావు మరియు అడ్డూరి శ్రీరామ్ డైరీ మరియు క్యాలెండర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ఇళ్లలో వెలుగులు నింపుతున్న సేవాభావంతో కూడిన ఉద్యోగులుగా O&M విద్యుత్ ఉద్యోగులను కొనియాడారు. కూటమి ప్రభుత్వం తరపున O&M ఉద్యోగులకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ, O&M విద్యుత్ ఉద్యోగుల సంఘం డిమాండ్లు న్యాయసమ్మతమైనవని పేర్కొంటూ, వాటిని ప్రభుత్వం మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. సెలవులు లేకుండా విధులు నిర్వహిస్తున్న O&M ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం సంఘం స్టేట్ ప్రెసిడెంట్ పాలరాజు మాట్లాడుతూ, ఓ & ఎమ్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు తప్పనిసరిగా సేఫ్టీ టూల్ కిట్లు అందజేయాలని, ప్రస్తుతం అన్ని విద్యుత్ ఉద్యోగులకు ఒకే విధంగా అమలు చేస్తున్న పీఆర్సీకి బదులుగా, 24 గంటలు విధులు నిర్వహిస్తున్న O&M ఉద్యోగులకు ప్రత్యేకంగా ఎక్కువ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ఎన్నేళ్లుగా అమలులో ఉన్న సైకిల్ అలవెన్స్‌ను రద్దు చేసి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెట్రోల్ అలవెన్స్ మంజూరు చేయాలని, 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరారు. ప్రతి ఉద్యోగికి పని గంటలు నిర్దేశించినప్పటికీ, ఓ & ఎమ్ విద్యుత్ ఉద్యోగులకు మాత్రం 24 గంటలు పని చేయాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ, పని గంటల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సెలవు దినాలు ఇతర ఉద్యోగులతో సమానంగా కల్పించాలని, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ఉద్యోగులు మరణిస్తే రూ.1 కోటి 50 లక్షల నష్టపరిహారం అందజేయాలని కోరారు.
అనంతరం ప్రధాన కార్యదర్శి చిట్టూరి రమేష్ మరియు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దవనం దొరబాబు మాట్లాడుతూ, తమ సంఘం ఎలాంటి ఇతర జేఏసీలతో కలవదని, సంఘంలో అత్యున్నత స్థాయి నుంచి చివరి స్థాయి వరకు అన్ని పదవులు O&M విద్యుత్ ఉద్యోగులకే ఉంటాయని స్పష్టం చేశారు. తమ డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రాన్ని త్వరలోనే సంబంధిత మంత్రిత్వ శాఖకు అందజేస్తామని, న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. అనంతరం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ దర్శన కిషోర్ కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ జి. శ్రీనుబాబు, స్టేట్ అడ్వైజర్ నత్తా జయరాజు, గిరి, ఎస్. రాజు, స్టేట్ ట్రెజరర్ వై. రాజుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి O&M విద్యుత్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *