-పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి. దామోదర్ నాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఈ నెల19 నుండి 31 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి. దామోదర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. పశువుల ఆరోగ్య రక్షణ, ఉత్పాదకత పెంపుదల, వ్యాధుల నియంత్రణ మరియు పశుపోషణ ఖర్చులను తగ్గించడం. పశు పోషణ పై అవగాహన కలిగించడానికి రాష్ట్రంలోని 13,257 గ్రామాలలో జన్మభూమి తరహాలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ శిబిరాలలో నట్టల నివారణ మందుల పంపిణీ (గొర్రెలు, మేకలకు ఏడాదికి 4 సార్లు, పెద్ద పశువులకు 2 సార్లు).
వ్యాధి నిరోధక టీకాలు, పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలు. శాస్త్రీయ పశు యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. గత ఏడాది 13,257 గ్రామాల్లో నిర్వహించిన శిబిరాల ద్వారా దాదాపు 10.48 లక్షల పశువులకు వైద్య సేవలు అందించగా, 5.36 లక్షల మంది పశుపోషకులు లబ్ధి పొందారన్నారు. అదే స్పూర్తితో ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల కుటుంబాలు పశుపోషణపై ఆధారపడి జీవిస్తున్నాయని, పశుసంపదలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో (గొర్రెలు, మేకలు మరియు కోళ్ళ సంఖ్యలో 2వ స్థానం) ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ పిలుపు మేరకు రాష్ట్రంలోని పశుపోషకులందరూ ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పశుసంవర్ధక శాఖ సిబ్బంది బాధ్యతాయుతంగా ఈ శిబిరాలను నిర్వహించి, పశుపోషకులకు మెరుగైన సేవలు అందించేలా ఏర్పాటు చేసినట్లు పశు సంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి. దామోదర్ నాయుడు ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News