Breaking News

ఎంఎస్ఎంఈల బలోపేతం దిశగా “క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (CDP)” ప్రారంభం

-రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSMEs) ను అభివృద్ధి పర్చాలనే లక్ష్యంతో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన “ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (AP-CDP)” కు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఆమోదం లబించినట్లు రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCలు) స్థాపించబడతాయని, ఈ సెంటర్స్ ద్వారా ప్రింటింగ్, అగ్రి-బేస్డ్, గోల్డ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో సాంకేతిక సదుపాయాలు, ప్యాకేజింగ్ యూనిట్లు, జాబ్ వర్క్ ఫెసిలిటీస్ ఏర్పాటు కానున్నాయన్నారు. ఈ కేంద్రాలు పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, సుమారు 1,840 MSME యూనిట్లకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు 7,500 కు పైబడి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలుగనున్నట్లు మంత్రి తెలిపారు.

శుక్రవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSMEs) అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిన ఫలితంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో MSME రంగానికి బలాన్నిచ్చే విధంగా, సెక్టార్ ఆధారిత క్లస్టర్లను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమల సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కలిసి “సెక్టోరల్ పార్క్స్” రూపంలో అభివృద్ధి చెందేలా, వాటి కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్స్ (CFCs) ఏర్పాటు చేయడం ద్వారా యంత్రాంగం, మౌలిక వసతులు మరియు ఆధునిక సాంకేతికతను భాగస్వామ్యం చేసుకునే అవకాశం కల్పించనుందన్నారు. దీని ద్వారా చిన్న పరిశ్రమలు పెద్ద సంస్థలతో పోటీ చేయగల సామర్థ్యాన్ని పొందుతాయని, పరిశ్రమల వృద్ధికి దోహదం చేసే ఈ AP-CDP ప్రోగ్రాం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక మైలురాయిగా నిలవనుందని ఆయన అభివర్ణించారు.

ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులను కేటాయించిదని, ప్రతి ప్రాజెక్టుకు రూ.5 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు ఆర్థిక సహాయాన్ని అందించనుందన్నారు. ఈ ప్రాజెక్టుల కింద మొత్తం 45 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అభివృద్ధి చేయబడతాయని, ప్రస్తుతం సెంట్రల్ ప్రభుత్వ సహకారంతో 40 క్లస్టర్ ప్రాజెక్టులు ఇప్పటికే గ్రౌండ్ అవుతున్నాయని, ఇప్పుడు రాష్ట్రం తన సొంత స్కీమ్‌గా CDPని ప్రారంభించిందన్నారు.

సెంట్రల్ స్కీమ్ విధానానికి అనుగుణంగా, ఈ ప్రాజెక్టులలో మిషనరీపై 100% సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, భవనాలు ఎస్పీవీ (SPV)లు నిర్మించుకుంటాయని, భూమి APIIC పార్కుల్లో సమకూర్చబడుతుందని మంత్రి తెలిపారు. ఈ విధానం ద్వారా పరిశ్రమలకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మరియు ఆపరేటింగ్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయన్నారు.

ఇదే దిశగా, గౌరవ ముఖ్యమంత్రి గారు సిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం (CMEGP) ను కూడా ప్రారంభించేందుకు ఆమోదం తెలిపారన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం (PMEGP) తరహాలో ఉండి, ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉంటుందన్నారు. పిఎంఈజిపి తరహాలో సిఎమ్ఈజిపి లో కూడా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌కి రూ.50 లక్షల వరకు, సర్వీస్ యూనిట్స్‌కి రూ.20 లక్షల వరకు రుణ సబ్సిడీ అందించబడుతుందన్నారు.

అదే విధంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాదానం చెపుతూ గతంలో పెండింగ్‌లో ఉన్న ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ రూ.1500 కోట్లలో రూ.438 కోట్లను ఇప్పటికే విడుదల చేయడం జరిగిందని, వీటిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రూ.230 కోట్ల కేటాయింపుతో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఇంకా మిగిలిన పెండింగ్ ఇన్సెంటివ్‌ల కోసం మరో రూ.1000 కోట్ల నిధుల సమీకరణ జరుగుతోందని మంత్రి తెలిపారు.

మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం మైక్రో క్రెడిట్ ప్లాన్, యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ లను అమలు చేస్తోందని, సిఆర్పీ (Community Resource Person) వ్యవస్థ ద్వారా గ్రామస్థాయిలో మహిళలకు లోన్ సదుపాయాలు అందుబాటులోకి తెచ్చి, “మన డబ్బులు – మన లెక్కలో” అనే మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ లావాదేవీల్లో పారదర్శకతను తీసుకురావడం జరిగిందన్నారు. మహిళా సమూహాలకు సంబంధించిన ఫేక్ గ్రూపులు, మిస్‌యుటిలైజేషన్ కేసులు గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ప్రస్తుతం బ్యాంకులు, SERP, DRDAలు కలిసి సులభమైన రుణ మంజూరు, సమర్థమైన మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.

అలాగే, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెన్షన్ రీ-వెరిఫికేషన్ ప్రాసెస్ వేగవంతంగా కొనసాగుతోందని, సుమారు 8 లక్షల డిసబిలిటీ పెన్షనర్లలో 6 లక్షలమందిని రీ-వెరిఫై చేసి, 90 వేల మందిని అనర్హులుగా గుర్తించినా, వారిలో అర్హత ఉన్నవారికి తిరిగి పెన్షన్ కొనసాగించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో పౌరుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని సక్రమమైన రీ-వెరిఫికేషన్ జరుగుతోందన్నారు.

క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, CM Employment Generation Programme మరియు మహిళా ఆర్థిక స్వయం సాధన కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య పారిశ్రామిక సమతుల్య అభివృద్ధిని సాధించడంలో కీలకపాత్ర పోషించనున్నాయనే అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *