విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎర్రచందనం, శ్రీగంధం చోరీ కేసులను రాష్ట్రాల పరిధి నుంచి తీసి సి బి ఐ పరిధిలోకి తీసుకువెళ్లాలని శ్రీగంధం ఎర్రచందనం పెంపకం దారుల సమాఖ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. రైతులు సాగుచేసిన ఎర్ర చందనం శ్రీ గంధం చెట్ల మీద అటవీ శాఖ నిబంధనలు వర్తింప చేయకూడదని విజ్ఞప్తి చేసింది.
గుణదలలోని పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎర్రచందనం శ్రీగంధం చెట్ల పెంపకం దారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి తుమ్మల మురళీకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎర్రచందనం 20వేల ఎకరాలలో శ్రీగంధం 90 వేల ఎకరాలలో చెట్ల పెంపకం జరుగుతుందని తెలిపారు. సుమారు 50 వేల మంది రైతులు ఎర్రచందనం శ్రీగంధం చెట్లను పెంచుతూ జీవనాధారాన్ని సాగిస్తున్నారని తెలిపారు. ఎర్రచందనం, శ్రీగంధం కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీటికి రక్షణ కరువైందని తెలిపారు. ఎర్రచందనం, శ్రీగంధం చెట్లకు రక్షణ లేకపోవడం కారణంగా చోరీలు జరుగుతున్నాయని దీని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని తీసుకురావడం ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందని విడివిడిగా చట్టాలు ఉండటం వలన రైతులు నష్టపోతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎర్రచందనం శ్రీగంధం చెట్లను చోరీ చేసే వారిని కఠినంగా శిక్షించాలని ఈ కేసులను సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
శ్రీగంధం ఎర్రచందనం చెట్ల పెంపకం దారులను ప్రభుత్వం సహకారం అందించాలని వారికి రుణ సౌకర్యం కూడా కల్పించాలని కోరారు. ఈ చెట్ల పెంపకంపై రైతుల్లో అవగాహన తక్కువగా ఉందని ప్రభుత్వం అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. ఈ చెట్ల పెంపకంపై కేంద్ర ప్రభుత్వం రీసెర్చ్ ను మరింతగా డెవలప్ చేయాలని అన్నారు. ఎర్రచందనం శ్రీగంధం చెట్లను కలపగా కాకుండా మార్చి వేరువేరు రూపాల్లో మార్చి అమ్ముకునే విధంగా నిబంధనలను సవరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థించారు. ఎర్రచందనం శ్రీగంధం కు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని, డిమాండ్కు తగ్గ విధంగా అవకాశాలు కూడా కల్పించాలని సూచించారు.
విలేకరుల సమావేశంలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గారపాటి పూర్ణ చంద్రరావు, ఉపాధ్యక్షులు గోగినేని కృష్ణారావు,కర్ణాటక రైతు సమక్య అధ్యక్షుడు కెంపా రెడ్డి అమర నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News