అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2026–27 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,876.23 కోట్లు కేటాయించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాష్ట్ర బడ్జెట్లో రూ. 143 కోట్లు అధికంగా కేటాయించడం, స్వయం సహాయక సంఘాల మహిళల సాధికారత, గ్రామీణ జీవనోపాధుల పురోగతిపట్ల రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది, సెర్ప్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాలు, గ్రామ సంఘాల సహాయకులకు గౌరవ వేతనాలు, అలాగే సెర్ప్ మరియు డి.ఆర్.డి.ఎ కార్యాలయాల నిర్వహణ కోసం మొత్తంగా రూ. 464.99 కోట్లు కేటాయించారని తెలిపారు. అదేవిధంగా దీనదయాల్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (DAY–NRLM) కింద రూ. 818 కోట్లు, స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రైజ్ ప్రోగ్రామ్ కింద రూ. 72 కోట్లు, మహిళా కిసాన్ శశక్తీకరణ కార్యక్రమం కింద రూ. 30 కోట్లు, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కోసం రూ. 15 కోట్లు కేటాయించారని తెలిపారు.
దీనదయాల్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (DAY–NRLM) కింద రాష్ట్రానికి లభించే వాస్తవ కేటాయింపుల ఆధారంగా అదనంగా రూ. 1,200 కోట్లు వరకు పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లు మంత్రి తెలిపారు. దీంతో 2026–27 సంవత్సరంలో మొత్తం రూ. 3,000 కోట్ల వ్యయంతో స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాధుల మెరుగుదల, ఆదాయ వృద్ధి మరియు స్థిరమైన ఉపాధి అవకాశాల సృష్టిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని చెప్పారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన “ఒక కుటుంబంలో ఒక పారిశ్రమికవేత్త (One Family – One Entrepreneur) మహత్తర లక్ష్య సాధనలో భాగంగా సుమారు 5 లక్షల మహిళలను ఔత్సాహికులుగా తీర్చిదిద్దడం, అలాగే రైతు ఉత్పత్తి సంస్థలు (Farmer Producer Organisations (FPOs) ను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ముందుకు సాగుతున్నదని తెలిపారు.
గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా అధిక బడ్జెట్ కేటాయించడమే కాకుండా, దీనదయాల్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (DAY–NRLM) ద్వారా లభించే నిధుల ఆధారంగా మొత్తం వ్యయాన్ని రూ. 3,000 కోట్ల వరకు విస్తరించేందుకు దృఢ నిశ్చయంతో ముందుకు వస్తున్న ముఖ్యమంత్రి కి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
స్వయం సహాయక సంఘాల మహిళల సమగ్ర సాధికారత, స్థిరమైన జీవనోపాధుల విస్తరణ, మరియు గ్రామీణ ఆర్థికాభివృద్ధి లక్ష్యాల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News