– ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేలా దివ్యాంగ శక్తి పథకం
– స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ దిశగా ప్రయాణం
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సాధికారతకు కొత్త శక్తినిచ్చేందుకు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ప్రగతి దిశగా పయనించేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి, .. మంత్రి నారా లోకేష్‌తో కలిసి మంగళగిరిలో ప్రారంభించిన అనంతరం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ – సిటీ టెర్నినల్ ఒకటో నంబరు ప్లాట్‌ఫాం వద్ద జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పాల్గొన్నారు. దివ్యాంగ శక్తి పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. దివ్యాంగులతో కలిసి బస్సులో కొంత దూరం ప్రయాణించారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చని వారికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ గతంలో ఉన్న నిబంధనలను తొలగించి దివ్యాంగ శక్తి ద్వారా 21 కేటగిరీల్లో 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్నవారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతోందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి పథకాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లాలోనూ అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరిగాయన్నారు. సమాజం అభివృద్ధి పథంలో పయనించాలంటే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా చేయూతనివ్వాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త సాకారానికి కూడా ఈ పథకం చేయూతనిస్తుందని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారిని సమాజంలో మరింత చురుకుగా భాగస్వామ్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ టి.సాయిచరణ్ తేజ, బస్టాండ్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సీహెచ్ సూర్య పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News