విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని పున్నమి ఘాట్ సమీపంలో గల బబ్బూరి గ్రౌండ్స్ లో జీవన్ సాగర్ ట్రేడ్ ఫెయిర్ ‘దుబాయ్ వాటర్ ఫాల్స్’ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ముఖ్య అతిథి గా ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ చౌదరి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సుమారు 50 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవుతో కొండల నుంచి కిందకు జాలువారేలా నిర్మించిన కృత్రిమ జలపాతం (వాటర్ ఫాల్స్) ని చూసి ఆశ్చర్యచకితులై, కృత్రిమ జలపాతం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవనుందన్నారు. వేసవి సెలవుల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ‘దుబాయ్ వాటర్ ఫాల్స్’ ఎగ్జిబిషన్ సిద్ధమైందని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు జి.మోహన్రావు, పి.కృష్ణ తదితరులు మాట్లాడుతూ ఈ ప్రదర్శన మే 1వ తేదీ నుంచి జూన్ 17 వరకు కొనసాగుతుందన్నారు. కృత్రిమ జలపాతం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవనుందన్నారు. వేసవి సెలవుల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 100కు పైగా వాణిజ్య స్టాళ్లు ఉన్నాయని, జువెలరీ, గాజులు, పాదరక్షలతో పాటు చిన్నారులు, పెద్దల కోసం వాటర్ బోట్, జెయింట్ వీల్, కొలంబస్, టోరా టోరా వంటి అత్యాధునిక రైడ్లను అందుబాటులో ఉంచామన్నారు. సందర్శకుల కోసం నోరూరించే మిర్చి బజ్జీ, గోబీ మంచూరియా, చాట్ వంటి వివిధ రకాల ఆహార పదార్థాలతో కూడిన ఫుడ్ కోర్టులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. భద్రతా పరంగా కలెక్టర్, పోలీసు కమిషనర్ మరియు అగ్నిమాపక శాఖ అధికారుల సూచనల మేరకు ఐదు ఫైర్ ఎగ్జిట్లు, అగ్నిమాపక పరికరాలను సిద్ధం చేసినట్లు జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ నిర్వాహకులు వెల్లడించారు. నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని వారు కోరారు.
Prajavartha Online Telugu News