Breaking News

గోదావరి పుష్కరాలు –2027కు వినూత్న పర్యాటక ప్రణాళికలు రూపొందించాలి

-టూర్ అండ్ ట్రావెల్స్, టూరిజం ప్రతినిధులతో కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి పుష్కరాలు – 2027 సందర్భంగా జిల్లాకు వచ్చే యాత్రికులు, పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు సమగ్ర పర్యాటక ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. మంగళవారం బొమ్మూరు కలెక్టరేట్‌లో టూర్ అండ్ ట్రావెల్స్, టూరిజం, క్యాబ్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పుష్కరాల నేపథ్యంలో పర్యాటక అభివృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లాలో ప్రస్తుతం పర్యాటకుల ప్రయాణ ధోరణి ఎలా ఉందో, ప్రజలు వ్యక్తిగత కార్లను ఎక్కువగా వినియోగిస్తున్నారా లేదా ఇతర రవాణా సౌకర్యాలను ప్రాధాన్యత ఇస్తున్నారా, ఏయే సీజన్లలో పర్యాటక రద్దీ అధికంగా ఉంటుందో, ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఎంతమంది ఇతర ప్రాంతాలకు పర్యాటక ప్రయాణాలు చేస్తున్నారో, వారు ఎక్కువగా సందర్శిస్తున్న ప్రాంతాలేమిటో వివరాలను అడిగి తెలుసుకున్నారు. పుష్కరాల సందర్భంగా జిల్లాలో రూపొందించిన పర్యాటక ప్యాకేజీలు వాస్తవ పరిస్థితులకు ఎంత మేరకు అనుగుణంగా ఉన్నాయో ప్రతినిధుల అభిప్రాయాలను కోరారు. ఎక్కువ మంది పర్యాటకులు జిల్లాలోని వివిధ ప్రాంతాలను సందర్శించేలా ఎలాంటి ప్యాకేజీలను రూపొందిస్తే ప్రయోజనకరంగా ఉంటుందో సూచనలు ఇవ్వాలని, వాటిని అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ విషయంలో టూర్ అండ్ ట్రావెల్స్ సంస్థలతో భాగస్వామ్యంగా పనిచేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజమహేంద్రవరం కేంద్రంగా మారేడుమిల్లి, పాపికొండలు, దిండి, పంచారామ క్షేత్రాలు, ఇతర ప్రముఖ దేవాలయాలు, ప్రకృతి అందాల ప్రాంతాలను అనుసంధానిస్తూ కొత్త టూరిస్ట్ సర్క్యూట్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అలాగే సంప్రదాయ గోదావరి వంటకాలతో కూడిన ప్రత్యేక ఆహార అనుభవాలు, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసే “ఎక్స్‌పీరియన్స్ టూరిజం”ను ప్రోత్సహించేందుకు అవసరమైన సూచనలు ఇవ్వాలని ప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా క్యాబ్ అసోసియేషన్ ప్రతినిధులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, జాతీయ రహదారుల వద్ద జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రదేశాల సమాచారంతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తే పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. అలాగే గోదావరి జిల్లాల పర్యాటక విశిష్టతలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రత్యేకంగా ఒక “టూరిజం అంబాసిడర్”ను నియమించాలని టూరిజం, ట్రావెల్స్ ప్రతినిధులు ప్రతిపాదించారు. పుష్కరాల సందర్భంగా పర్యాటక రంగ అభివృద్ధికి వినూత్న ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలతో ఒక వారం రోజుల్లో ముందుకు రావాలని కలెక్టర్ ప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వం, పర్యాటక రంగ భాగస్వాములు, స్థానిక సంస్థల సమన్వయంతో పుష్కరాలను ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక పరంగా దేశవ్యాప్తంగా ఆదర్శవంతమైన ఉత్సవంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో టూరిజం ఆర్డీ ఎన్ వి వి ఎస్ మూర్తి, జిల్లటూరిజం అధికారి పి వెంకటాచలం, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, ఆర్టిసి జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం వై ఎస్ ఎం మూర్తి, జిల్లా దేవాదాయ అధికారి ఈ వి సుబ్బరావు, డి ఆర్ డి ఎ పిడి బి. నగేష్, మెప్మా పిడి, ఇతర అధికారులు యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *