Breaking News

జాతీయ ఆహార భద్రత చట్టం–2013 అమలును జిల్లా స్థాయి కమిటీలు నిరంతరం పర్యవేక్షించాలి

– జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్
– ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, సోము వీర్రాజు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ ఆహార భద్రత చట్టం–2013 ప్రకారం అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సమన్వయకర్త గా వి. పార్వతీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ తొలి సమావేశానికి జేసీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ ఆహార భద్రత చట్టం కింద అమలవుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగేందుకు కమిటీ సభ్యులు తమ బాధ్యత లను సమర్థంగా నిర్వర్తించాలని కోరారు. నిబంధనల ఉల్లంఘనలు లేదా అవకతవకలు ఎక్కడైనా గమనించి నట్లయితే జిల్లా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 1952 ద్వారా లేదా 1100 టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా లిఖితపూర్వకంగా తెలియ జేయాలని సూచించారు. జాతీయ ఆహార భద్రత పరిధిలో అమలు జరుగుతున్న పథకాలు సక్రమ అమలు చేసే విధానం పై పర్యవేక్షణ బాధ్యత జిల్లా కమిటీ వహిస్తుందన్నారు. అందులో భాగంగా ప్రతి మూడు నెలలకి ఒక సారి సమావేశం నిర్వహించి, జిల్లా లో ఆహార భద్రత కోసం అమలు జరుగుతున్న తీరుపై సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందనీ తెలియ చేయడం జరిగింది. ఫిర్యాదుల redress చేసే అధికారం జాయింట్ కలెక్టర్ కలిగి ఉంటారనీ తెలియ జేయడం జరిగింది. 2025 లో మొత్తం 445 అర్జీలు రాగా వాటిని పరిష్కారం చేయడం జరిగిందనీ తెలిపారు. 2026 లో ఇప్పటి వరకు 80 అర్జీలు స్వీకరించగా వాటిలో 75 పరిష్కారం చేసినట్లు జేసీ తెలిపారు. ప్రతి పౌరుడు గౌరవప్రదమైన జీవితం గడపడానికి అవసరమైన నాణ్యమైన ఆహార ధాన్యాలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచడం, ఆహార భద్రతతో పాటు పోషక భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డి ఎస్ వో వి పార్వతీ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా విజిలెన్స్ కమిటీలు పర్యవేక్షణ నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత చట్టం–2013లోని సెక్షన్–29 ప్రకారం రాష్ట్ర, జిల్లా, మండల, ఎఫ్‌పీ షాప్ (అర్బన్, రూరల్) స్థాయిల్లో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కొన్ని దుకాణాల్లో తూనికలు, కొలతల నిబంధనలు పాటించకుండా నిత్యావసర వస్తువులు విక్రయిస్తున్నారని, లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. నాణ్యమైన బియ్యం ధరలు మార్కెట్లో అధికంగా ఉండటం వల్ల మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశాల అజెండాను కనీసం మూడు రోజుల ముందుగానే సభ్యులకు పంపించాలని సూచించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న సేవలు, పోషకాహార వివరాలతో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, ప్రధానమంత్రి పోషణ పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న పోషకాహార సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. కొన్ని రేషన్ దుకాణాల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు సలాది ఉదయభాస్కరరావు మాట్లాడుతూ నిల్వ ఉంచిన మాంసం విక్రయాలపై ఆహార భద్రత అధికారుల పర్యవేక్షణ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మాంసంపై తేదీ ఆధారిత ముద్రలు ఉండేవని, ప్రస్తుతం ఆ విధానం లేకపోవడంతో నిల్వ ఉంచిన లేదా నాణ్యత కోల్పోయిన మాంసం విక్రయించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని కోరారు. జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు మాట్లాడుతూ రేషన్ కార్డుల విభజన (స్ప్లిట్) సమస్యల కారణంగా అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. వివాహమైన కుమార్తెల పేర్లు ఇంకా తల్లి రేషన్ కార్డులోనే కొనసాగుతున్న కారణంగా కొత్త కార్డులు పొందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తద్వారా కొన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో అందిస్తున్న ఆహార పదార్థాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫుడ్ సేఫ్టీ పరీక్షలకు పంపించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వి పార్వతి, రాజమహేంద్రవరం మరియు కొవ్వూరు ఆర్డీవో లు ఆర్. శివ రాముడు, కె. ఆనంద్ రావు , జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *