Breaking News

నిడదవోలు నియోజకవర్గానికి సమృద్ధిగా సాగునీరు.. ప్రతి ఎకరాకూ నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు మండలం విజ్జేశ్వరంలో పెండ్యాల పంప్ స్కీమ్ ద్వారా సాగునీటిని విడుదల చేసిన మంత్రి కందుల దుర్గేష్..కాలువకు మోటార్ స్విచ్ ఆన్ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దుర్గేష్
-నిడదవోలు రైతులకు ఇక సాగునీటి ఢోకా లేదు..13 గ్రామాల పరిధిలోని 7,000 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి: మంత్రి కందుల దుర్గేష్
-ఎర్రకాలువ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం.. రైతులను ముంపు బారిన పడకుండా కాపాడుతాం: మంత్రి కందుల దుర్గేష్
-కూటమి ప్రభుత్వంలో రైతన్నకు సంపూర్ణ భరోసా – ‘అన్నదాత సుఖీభవ’తో రూ.20 వేల సాయం
-రైతు ముఖంలో ఆనందం.. సకాలంలో సాగునీరు అందించి అండగా నిలిచిన మంత్రి కందుల దుర్గేష్ కు రైతాంగం కృతజ్ఞతలు
-నిడదవోలు ఆయకట్టుకు జలసిరి..కాల్వల్లోకి చేరిన నీరు.. నాట్లకు సిద్ధమవుతున్న స్థానిక రైతాంగం

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా నీరు అందించే పూర్తి బాధ్యత తనదేనని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మంగళవారం నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం, కొబ్బరికాయ కొట్టి పెండ్యాల పంప్ స్కీమ్ ద్వారా సాగునీటి కాలువలకు మంత్రి దుర్గేష్ మోటారు స్వీచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. కాలువలో పూలు, పండ్లు, వస్త్రం వేసి పవిత్ర జలాలకు నమస్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… ఈ పంప్ స్కీమ్ ద్వారా 13 గ్రామాల్లోని దాదాపు 7,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, దీని ద్వారా రైతన్నలు ఆనందంగా పంటలు పండించుకోవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పెండ్యాల పంప్ స్కీమ్ ద్వారా నీళ్లు విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత వారమే ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ, బిజీ షెడ్యూల్ వల్ల శాస్త్రోక్తంగా మంచి రోజును నిర్ణయించి ఈరోజు నీటిని విడుదల చేశామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులందరూ ఈ నీటిని సద్వినియోగం చేసుకుని, సకాలంలో నాట్లు వేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది వ్యవసాయం లాభసాటిగా సాగి, రైతులకు మంచి ఆదాయం రావాలని కాంక్షించారు.రైతాంగ సమస్యల పరిష్కారానికి నీటి సంఘాలు ఎంతగానో దోహదపడతాయన్న మంత్రి, నీటి సంఘాల కార్యవర్గానికి, రైతన్నకు సంపూర్ణంగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతన్నలు ఎంతో సంతోషంగా ఉన్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టిందన్నారు.ఇప్పటికే ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన’ కింద ఏటా రూ. 20,000 ఆర్థికసాయం అందించడం జరిగిందన్నారు.ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే నగదును నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్రంగా దగా పడ్డారని, అప్పటి ధాన్యపు బకాయిలను కూడా ఈ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రాగానే చెల్లించి రైతులకు న్యాయం చేసిందని గుర్తుచేశారు.

ఎర్రకాలువ ముంపునకు శాశ్వత పరిష్కారం

రైతన్నకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎర్రకాలువ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా స్థానిక ఎంపీ, తాను మరియు ప్రజా ప్రతినిధులందరూ కలిసి గట్టి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. రైతులను ముంపు బారిన పడకుండా కాపాడుతామని ఈ సందర్భంగా భరోసానిచ్చారు. రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి మరింత మేలు చేస్తామన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కెల్లా నిడదవోలు నియోజకవర్గంలోనే రైతాంగం వరిని అత్యధికంగా పండిస్తారని, ఇది పూర్తిగా వ్యవసాయాధారిత నియోజకవర్గమని మంత్రి పేర్కొన్నారు. అందుకే ఈ ప్రాంత రైతులకు సాగునీటి కొరత లేకుండా చూసే బాధ్యతను తాను తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించి ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ రంగానికి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు.

చివరగా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నీటి సంఘాల అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సకాలంలో సాగునీరు అందించి అండగా నిలిచిన మంత్రి కందుల దుర్గేష్ కు రైతాంగం కృతజ్ఞతలు తెలిపారు.నిడదవోలు ఆయకట్టుకు జలసిరి రావడంలో కాల్వల్లోకి నీరు చేరిందని, త్వరితగతిన నాట్లకు సిద్ధమవుతామని రైతాంగం తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *