-ప్రత్యేక అవసరాలు గల పిల్లల (CwSN) గుర్తింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్ణయం
-‘ప్రశస్త్’ యాప్ వినియోగంపై ఉపాధ్యాయులకు తక్షణమే శిక్షణ ఇవ్వాలని ఆదేశం
-లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి: సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు, I.A.S.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నవిద్యార్థులందరికీ ‘ప్రశస్త్ యాప్ 2.0’ ద్వారా తప్పనిసరిగా స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, I.A.S. బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను (CwSN) ముందస్తుగా గుర్తించి, వారికి అవసరమైన అదనపు విద్యా ప్రోద్బలాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్పీడీ వివరించారు. ఈ ‘ప్రశస్త్ యాప్ 2.0’ ప్రస్తుతం UDISE+ తో అనుసంధానించబడిందని, దీని ద్వారా పిల్లల స్క్రీనింగ్, మానిటరింగ్, గుర్తింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, క్రమబద్ధంగా జరుగుతుందని ఎస్పీడీ పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ ఈ స్క్రీనింగ్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలని, తమ స్కూల్లో నమోదైన ఏ ఒక్క విద్యార్థి కూడా విస్మరించకుండా 100% స్క్రీనింగ్ పూర్తయ్యేలా బాధ్యత వహించాలని ఆదేశించారు.
ఆదేశాల్లో ముఖ్యమైనవి:
• రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లు, భవిత కేంద్రాల్లో పనిచేసే ఐఈఆర్పీలు అందరూ తప్పనిసరిగా ప్రశస్త్ యాప్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని, యాక్టివేట్ చేసుకోవాలి.
• తరగతి ఉపాధ్యాయులు అందరూ తమ తరగతుల్లోని విద్యార్థులందరికీ పార్ట్-1 స్క్రీనింగ్ పూర్తి చేయాలి. స్క్రీనింగ్ ఫలితాల ఆధారంగా అవసరమైన చోట స్పెషల్ ఎడ్యుకేటర్లు, భవిత కేంద్రాల సిబ్బంది యాప్ నిబంధనల ప్రకారం పార్ట్-2 స్క్రీనింగ్ నిర్వహిస్తారు.
• ఈ యాప్ వినియోగంపై ఉపాధ్యాయులకు, స్పెషల్ ఎడ్యుకేటర్లకు, సంబధిత స్టేక్‌హోల్డర్లకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా జిల్లా విద్యాశాఖాధికారులు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లను ఆదేశించారు.
నిర్దేశిత గడువు ఇదీ..
జూన్ – జూలై 2026 నాటికి ప్రధానోపాధ్యాయులు లేదా ప్రిన్సిపాల్స్ ఇన్‌స్టిట్యూషనల్/అడ్మిన్ లాగిన్ క్రియేషన్, యాక్టివేషన్ పూర్తి చేయాలి, ఆపై ఆగస్టు 2026 లో క్లాస్ టీచర్లు, స్పెషల్ ఎడ్యుకేటర్లు మ్యాపింగ్ అసైన్‌మెంట్ ప్రక్రియ చేపట్టాలి, అనంతరం సెప్టెంబరు 2026 లో జనరల్ టీచర్ల ద్వారా విద్యార్థులందరికీ పార్ట్-1 స్క్రీనింగ్ నిర్వహణ పూర్తి చేసి, చివరిగా అక్టోబరు 2026 నాటికి స్పెషల్ ఎడ్యుకేటర్ల ద్వారా అవసరమైన చోట పార్ట్-2 స్క్రీనింగ్ నిర్వహణను విజయవంతంగా ముగించాల్సి ఉంటుంది. ఈ స్క్రీనింగ్ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించాలని, నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
సమగ్ర శిక్ష జిల్లా ఐఈ కో-ఆర్డినేటర్లు వారంతపు పురోగతి నివేదికలను రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయానికి క్రమం తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. 100% స్క్రీనింగ్ పూర్తి చేయడంలో ఎలాంటి అలసత్వాన్ని వహించినా, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని బి. శ్రీనివాసరావు IAS., హెచ్చరించారు.
Prajavartha Online Telugu News