Breaking News

యోగాతో స‌మాజం ఆనందంగా.. సుసంప‌న్నంగా..

– యోగాను ప్ర‌తిఒక్క‌రూ ప్ర‌తిరోజూ ఆచ‌రించాలి
– జీవ‌న‌శైలి వ్యాధుల‌ను ఎదుర్కొనే మ‌హ‌త్త‌ర శ‌క్తికి యోగాకుంది
– యోగా పోటీల్లో విజేత‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను
– ప్ర‌భుత్వ చొర‌వ‌లో విజేత‌లు కూడా భాగ‌స్వాములు కావాలి
– రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో విజేత‌లుగా నిలిచిన‌వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాన‌ని.. మన ప్రాచీన భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ఒక ప్ర‌తీక అని.. మ‌న మునులు, రుషులు వారి విజ్ఞానాన్ని, అనుభవాన్ని రంగరించి యోగాను మ‌న‌కు వార‌స‌త్వ సంప‌ద‌గా అందించార‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు.
యోగాంధ్ర‌-2026లో భాగంగా గ్రామ‌, మండ‌ల‌, జిల్లా, రాష్ట్ర‌స్థాయిలో యోగా పోటీలు జ‌రిగాయి. రాష్ట్ర‌స్థాయి పోటీలు ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం, గుంటుప‌ల్లి డాన్‌బోస్కో స్కూళ్లో జ‌రిగాయి. ఈ పోటీల్లో దాదాపు 1,600 మంది పాల్గొన్నారు. వీరిలో 108 మంది విజేత‌లుగా నిలిచారు. వీరికి శ‌నివారం మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌, శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎన్‌. చక్రధర్ బాబు, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ త‌దిత‌రులు జ్ఞాపిక‌లు అందించి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ మ‌న ప్రాచీన ఘ‌న వార‌స‌త్వ సంప‌ద‌ను విశ్వ‌వ్యాప్తం చేసేందుకు గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి మొద‌ట్నుంచి విశేష కృషిచేస్తున్నార‌న్నారు. ఈ క్ర‌మంలోనే ఏటా జూన్ 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. దీనివ‌ల్ల కోట్లాది మంది ప్ర‌యోజ‌నం పొందుతున్నార‌న్నారు. యోగాతో శారీర‌క దృఢ‌త్వంతో పాటు మాన‌సిక ప్ర‌శాంత‌త‌, సృజనాత్మకత పెరగడమే కాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుంద‌న్నారు. ఈ సంవ‌త్స‌రం ఆరోగ్య‌క‌ర వృద్ధాప్యానికి యోగా థీమ్‌తో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నామ‌న్నారు. ప్ర‌తిరోజు 45 నిమిషాలు యోగాభ్య‌స‌న‌కు కేటాయించాల‌న్నారు. యోగాచ‌ర‌ణ‌తో డ‌యాబెటిస్‌, హైప‌ర్ టెన్ష‌న్ వంటి జీవ‌న‌శైలి వ్యాధుల‌ను క‌ట్ట‌డి చేయొచ్చ‌న్నారు. ప్ర‌జారోగ్యాన్ని సంరక్షించడంలో ప్రభుత్వం చేస్తున్న చర్యల్లో నేటి యోగాపోటీల విజేత‌లు కూడా భాగస్వామ్యం వహించాల్సిన అవసరం ఉంద‌న్నారు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందాన కాకుండా మనం మనల్ని కాపాడుకుంటూ మన కుటుంబాన్ని కాపాడుకుంటూ మన సమాజాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పిలుపునిచ్చారు.
శాస‌న‌స‌భ్యులు వసంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా యోగాకు పెరుగుతున్న ఆదరణకు భారతదేశపు ప్రాచీన రుషులు, మునులు అందించిన జ్ఞానమే కారణమని పేర్కొన్నారు. యోగా సాధన వల్ల ఆరోగ్యం మాత్రమే కాకుండా మనసు, శరీరం మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఉత్సాహం పెరుగుతాయని వివరించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తూ ప్రజాసేవలో నిరంతరం చురుగ్గా ఉండడం అందరికీ ఆదర్శమని అన్నారు. యోగా మనిషిలో క్రమశిక్షణను పెంపొందించి జీవిత లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి రోజుకు కనీసం ఒక గంట సమయం కేటాయించి యోగా సాధన చేస్తే ఆరోగ్యపరంగా, మానసికంగా మరింత దృఢంగా మారగలరని తెలిపారు.
సెకండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎన్‌. చక్రధర్ బాబు మాట్లాడుతూ.. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని పేర్కొన్నారు. గత ఏడాది విశాఖపట్నంలో లక్షలాది మంది పాల్గొని రికార్డులు సృష్టించడం గర్వకారణమన్నారు. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన యువతే దేశాభివృద్ధికి పునాది అని ఆయన పేర్కొన్నారు.
కార్య‌క్ర‌మంలో స‌మ‌న్వ‌య అధికారులు డా. సుజాత‌, డా. కృష్ణ‌వేణి, డా. సుక‌న్య‌, జిల్లా ఆయుష్ అధికారి డా. ర‌త్న‌ప్రియ‌ద‌ర్శిని త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *