– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ చొరవకు జాతీయ స్థాయి అవార్డు
– స్వర్ణాంధ్ర, వికిసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా వినూత్న కార్యాచరణ
– టీమ్ ఎన్‌టీఆర్ జిల్లా సమష్టి కృషికి ఫలితమన్న కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినూత్నంగా అడుగులు వేస్తేనే అన్నింటా వికాసానికి ద్వారాలు తెరుస్తాయి. ముఖ్యమంత్రి దార్శనికత, వినూత్న కార్యాచరణ స్ఫూర్తికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ప్రారంభించిన ఇగ్నైట్ సెల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. తాజాగా ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని ఆగస్టు క్రాంతిమార్గ్, పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వేదికపై శనివారం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ తరఫున జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు పాల్గొని అవార్డును స్వీకరించారు. అవార్డు రావడంపై కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ దేశంలో పరిపాలన, అభివృద్ధి, సృజనాత్మక కార్యక్రమాల అమల్లో విశిష్ట సేవలను గుర్తిస్తూ అందజేసే ఈ అవార్డుకు ఇగ్నైట్ సెల్ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. స్కోచ్ సంస్థ నిర్వహించిన కఠినమైన, పారదర్శకమైన, ఫలితాల ఆధారిత మూల్యాంకన ప్రక్రియలో అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసిన అనంతరం ఇగ్నైట్ సెల్ ప్రాజెక్టు అవార్డుకు ఎంపికయిందన్నారు. రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఫర్ వికసిత్ భారత్ అంశంపై నిర్వహించిన 108వ స్కోచ్ సదస్సులో భాగంగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగిందన్నారు. ప్రభుత్వ పరిపాలనలో వినూత్న ఆలోచనలు, ప్రజా సేవల మెరుగుదల, అభివృద్ధి కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు గుర్తింపుగా లభించిన ఈ జాతీయ స్థాయి పురస్కారం టీమ్ ఎన్‌టీఆర్ జిల్లా సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సాంకేతికత, కొత్త ఆలోచనలు, సమర్థవంతమైన పరిపాలనకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన కార్యక్రమాలకు ఈ అవార్డు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర @ 2047 దార్శనిక ప్రణాళికకు అనుగుణంగా దశల వారీగా లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లాస్థాయిలో ఇగ్నైట్ (Information for Growth through Nurturing Income generating Innovation, Technology and Encouraging Entrepreneurs) సెల్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించామని.. కలెక్టరేట్, ఆకాంక్షిత బ్లాకులు పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం ఎంపీడీవో కార్యాలయాల ప్రాంగణాల్లో రోజుకో డిపార్టుమెంట్ ఇగ్నైట్ సెల్‌ను ఏర్పాటు చేసి.. ఆయా శాఖల పరిధిలోని పథకాలు, కార్యక్రమాలపై ప్రజలు, సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఆర్థికంగా, సాంకేతికంగా, మార్కెటింగ్ పరంగా అవసరమైన సహాయసహకారాలు అందిస్తున్నామని.. అభివృద్ధి, సంక్షేమాన్ని చివరిమైలు వరకు చేరువచేసేందుకు, వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఇగ్నైట్ సెల్ ఉపయోగపడుతోందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News