-పరిశుభ్రత అత్యంత ప్రాధాన్యత కల్గిన అంశం
-స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ
-నగర కమిషనర్ కె. మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరం క్లీన్, గ్రీన్ గుంటూరుగా మారాలంటే నగర ప్రజల విస్తృత భాగస్వామ్యం కీలకమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర (సాసా) కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కొనసాగింపులో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జిఎంసి ప్రధాన కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి, మార్కెట్ మెయిన్ రోడ్ స్వీపింగ్, విజ్ఞాన మందిరం దగ్గర కల్వర్ట్ ఫాగింగ్, డ్రైన్లలో టేమిఫాజ్ స్ప్రే, సిల్ట్ తొలగింపు, పబ్లిక్ టాయ్ లెట్స్ శుభ్రత పరిశీలన చేసి, విజ్ఞాన మందిరం ప్రాంగణంలో స్వచ్చత ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం సాసా కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని, గత నాలుగు శనివారాల నుండి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు “ఆపరేషన్ క్లీన్ స్వీప్” అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల ఈసారి సాసా కార్యక్రమం మరింత ప్రత్యేకంగా నిలిచిందని పేర్కొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో భాగంగా ప్రతి వారం ఒక థీమ్‌ను నిర్దేశించుకున్నామని, అందులో మొదటి వారంలో విజిబుల్ క్లీన్‌నెస్ మీద దృష్టి సారించగా, రెండవ వారంలో డ్రైన్ క్లీనింగ్, బల్క్ వేస్ట్ జనరేటర్స్ మరియు కొత్తగా వచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 పై ప్రత్యేకంగా దృష్టి సారించామని వివరించారు. ఒక క్యాంపెయిన్ మోడ్‌ను తీసుకొని చాలా చోట్ల విజిబుల్ క్లీన్‌నెస్, డ్రైన్ క్లీనింగ్‌లను పెద్ద ఎత్తున నిర్వహించామని, అలాగే మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డ్రైన్లలో పూడికతీత పనులను కూడా చాలా వరకు పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు.
అయితే క్యాంపెయిన్ మోడ్‌లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు, ఆపరేషన్ లేదా మిషన్ ముగిసిన తర్వాత కూడా అదే స్పూర్తితో నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. “ఏదైనా ఒక పనిని చేసి అలాగే వదిలేయకూడదు; మనం సాధించిన విజిబుల్ క్లీన్‌నెస్‌ను ఇలాగే కంటిన్యూస్‌గా మైంటైన్ చేయాలి. ప్రతి ఒక్క చిన్న సందులో ఉండే డ్రైన్లను కూడా రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూ ఉండాలి. పరిశుభ్రత అనేది అత్యంత ముఖ్యమైన అంశమని మనమందరం గుర్తుంచుకొని దీనిపై పని చేయాలి” అని పిలుపునిచ్చారు. శానిటేషన్ సూపర్‌వైజర్స్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్స్ మరియు మిగతా శానిటేషన్ సిబ్బంది అంతా తమ పరిధిలోని ప్రాంతాల పరిశుభ్రత తమ బాధ్యతగా భావించి పనిచేస్తే, తప్పకుండా గుంటూరు నగరాన్ని ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ గుంటూరుగా మార్చగలమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రయాణంలో శానిటేషన్ సిబ్బందితో పాటు ప్రజలు కూడా స్వయంస్ఫూర్తితో భాగస్వాములు కావాలని కోరారు. ఎన్‌జీఓలు, సివిల్ సొసైటీలు అందరూ కలిసి వస్తేనే ఈ పరిశుభ్రతను నిలబెట్టుకోగలమని, కాబట్టి ప్రతి వార్డ్ లో ఉండే యాక్టివ్ సిటిజన్స్ మరియు అసోసియేషన్లను కూడా భాగస్వాములు కావాల్సిందిగా స్థానిక అధికారులు, సిబ్బంది విజ్ఞప్తి చేయాలని సూచించారు. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం ఉంటేనే క్లీన్‌నెస్‌ను నిర్వహణ చేయడం సాధ్యమవుతుందన్నారు. “మనం ఉదయాన్నే ఎంత శుభ్రం చేసినా, మళ్ళీ ఎవరైనా చెత్తను విసిరేస్తూ, లిటరింగ్ చేస్తూ ఉంటే ఆ శ్రమకు ఫలితం ఉండదు. కావున ప్రతి వార్డులో, ప్రతి వీధిలో, ప్రతి ప్రాంతంలో మనమంతా ప్రజలతో కలిసికట్టుగా పని చేయాలి” అని వివరించారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో మన నగరానికి దేశంలోనే టాప్ ర్యాంక్ రావాలని ఆకాంక్షిస్తూ, కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
కార్యక్రమంలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, అదనపు కమిషనర్ జి.సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, బయాలజిస్ట్ శేషయ్య, ఉపా సెల్ పిఓ సింహాచలం మేనేజర్ బాలాజీ బాష, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణరెడ్డి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News