-49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి ఉన్న పోలియో రహిత హోదాను యదావిథిగా కొనసాగించేందుకు ఈ నెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలోపు వయస్సు కలిగి ఉన్న 49,20,239 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపింది.. రాష్ట్రంలో చివరి పోలియో కేసు 2008లో నమోదైందని, అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ పోలియో రహిత రాష్ట్రంగా కొనసాగుతోందని తెలిపింది. వీటి ఏర్పాట్లను రాష్ట్ర వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ఉన్నత స్థాయిలో ‘వర్చువల్’ గా సమీక్ష జరిపారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ చక్రధర్ బాబు నేడొక ప్రకటన జారీ చేశారు.
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న పోలియో కేంద్రాల ద్వారా చిన్నారులకు చుక్కలు వేయనున్నారు. అనంతరం 29, 30 తేదీల్లో ఇంటింటి సందర్శన ద్వారా మిగిలిన చిన్నారులకు చుక్కలు వేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 29,873 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. వలస కుటుంబాలు, నిర్మాణ ప్రాంతాలు, ఇటుక బట్టీలు, సంచార జాతుల నివాస ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1,757 ప్రత్యేక బృందాలను నియమించారు. బస్ నిలయాలు, రైల్వే నిలయాలు, విమానాశ్రయాలు, జాతరలు, సంతలు, ప్రధాన రాకపోకల ప్రాంతాల్లో 1,144 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇంటింటి సందర్శన కోసం 59,746 బృందాలను సిద్దంచేశారు. కార్యక్రమ నిర్వహణకు లక్షా 31 వేల 298 మంది సిబ్బంది పాల్గొననున్నారు.
కేంద్రం నుంచి వాక్సిన్ రాక.. జిల్లాలకు తరలిoపు
కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన 68 లక్షల 67 వేల 740 మోతాదుల పోలియో వాక్సిన్ ఇప్పటికే జిల్లాలకు తరలించారు. వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, పర్యవేక్షకులకు శిక్షణ పూర్తిచేశారు.
సాధారణ టీకా కార్యక్రమంలో పోలియో చుక్కలు తీసుకున్న పిల్లలు కూడా పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని వైద్య, ఆరోగ్యశాఖ కోరింది. పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ పరిరక్షణలో ప్రతి కుటుంబం భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేసింది.
భారతదేశం పోలియో రహిత దేశంగా కొనసాగుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వ్యాధి పూర్తిగా నిర్మూలన కాలేదు.
Prajavartha Online Telugu News