– క్షేత్రస్థాయిలో పర్యటించిన వివేక్ యాదవ్
– అత్యంత పారదర్శకంగా ప్రక్రియ పూర్తికి దిశానిర్దేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడంలో సమష్టి భాగస్వామ్యం అవసరమని ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వివేక్ యాదవ్ పేర్కొన్నారు.
శనివారం సీఈవో వివేక్ యాదవ్ విజయవాడ అర్బన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. చిట్టినగర్, కంసాలి పేట ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ 208, 217 పరిధిలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించారు. గత ఎస్ఐఆర్ ఆధారంగా ఓటర్ల మ్యాపింగ్, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, వాటి స్వీకరణ, డిజిటైజేషన్ పనులను పరిశీలించారు. నియోజకవర్గం స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి.. అక్కడి అధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. బూత్ లెవల్ అధికారులతో మాట్లాడి ప్రక్రియ అమలుపై ఆరా తీశారు. ఓటర్ల సేవలో స్ఫూర్తితో వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించి.. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లేందుకు కీలకమైన ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో కీలక భాగస్వాములు కావాలని సీఈవో వివేక్ యాదవ్ కోరారు. పర్యటనలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌వో) ఎ.రవీంద్రరావు, సహాయ ఈఆర్‌వోలు ఎన్.శ్రీనివాస్‌రావు, డి.హరీష్, జి.సృజన, చంద్రబోస్, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News