Breaking News

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్… ట్రిపుల్‌ రీజియన్ ప్రణాళిక

-శ్రమకోర్చి వ్యవస్థలను గాడిన పెడుతున్నాం
-సంక్షేమం- అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్నాం
-కేంద్రం అండ లేకుంటే కోలుకోవడం కష్టమయ్యేది
-రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలూ తెలుసుకోవాలి
-జీవితంలో ఎన్నడూ లేనంతగా గత రెండేళ్లలో కష్టపడ్డాను
-పీపీపీని వ్యతిరేకిస్తారు… భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ మాత్రం మాదంటారు
-రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌… ఆర్థిక పరిస్థితిపై ప్రజెంటేషన్‌
-విభజన నాటి నుంచి ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల వివరణ
-విభజన-విధ్వంస నష్టాలు… ప్రభుత్వ చర్యలు… భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా ప్రజెంట్ చేసిన సీఎం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
విభజన నాటి కంటే 2019-24 మధ్యన జరిగిన విధ్వంసం వల్లే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టపోయిందని, ఈ సమస్యను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తన జీవితంలో ఎన్నడూ పడనంత కష్టాన్ని గత రెండేళ్లల్లో పడ్డానని తెలిపారు. ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్రాన్ని మొత్తంగా గాడిలో పెట్టేశామని చెప్పడంలేదన్న సీఎం… రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేలా పోయిన బ్రాండ్‌ను ఎస్టాబ్లిష్ చేశామన్నారు. ఆర్థిక వెసులుబాటు లేకున్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమాన్ని అందిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలు.. ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలు ప్రజలకూ తెలియాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్‌లో రెండేళ్ల ఆర్థిక స్థితిగతులపై సీఎం చంద్రబాబు ప్రొగ్రెస్ రిపోర్ట్ ప్రజెంట్ చేశారు. 2019–24 మధ్య రాష్ట్రంలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, ప్రజలు, అధికారులు, ఉద్యోగులు భయపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఆ పాలనపై ప్రజల్లో వచ్చిన నిశ్శబ్ద విప్లవమే 2024 ఎన్నికల ఫలితాలని చెప్పారు. 2024 ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని, బ్రాండ్‌ ఏపీని తిరిగి తీసుకొస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని సీఎం అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. చెప్పిన విధంగా.. ఇచ్చిన తేదీల్లో సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఆదాయం పెరగాలంటే ముందుగా అభివృద్ధి జరగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతులు, కొత్త రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ఆ మేరకు కొత్త పాలసీలు తెస్తుందని సీఎం వివరించారు.

సమర్థవంతంగా పనిచేస్తే ప్రజలు సహకరిస్తారు

ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తే ప్రజలు కూడా అభివృద్ధిలో ఏ స్థాయిలో భాగస్వాములు అవుతారో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చాటిచెప్పిందని ముఖ్యమంత్రి అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి రెక్కలు వచ్చిన భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు. ఉత్తరాంధ్రను అంతర్జాతీయ అవకాశాలకు గేట్‌వేగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. దీన్ని ప్రజలు గ్రహించారు కాబట్టే… ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి ప్రజల నుంచి చక్కటి మద్దతు లభించిందని ముఖ్యమంత్రి అన్నారు. పీపీపీ పద్దతిలో ప్రాజెక్టులు చేపడుతుంటే వ్యతిరేకించిన వారు… అదే పీపీపీ పద్దతిలో చేపట్టిన భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ క్రెడిట్ మాత్రం తమదని చెప్పుకుంటున్నారని సీఎం విమర్శించారు. పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయని.. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు, ఆదాయం పెరుగుతాయని.. ఆదాయం పెరిగితే మరింత సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

గుంతల రోడ్లు.. గుదిబండ అప్పులు

2019–24 మధ్య రాష్ట్రాన్ని విషవలయంలోకి నెట్టారని… రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతోపాటు అభివృద్ధి వేగాన్ని నిలిపివేశారని అన్నారు. ఆదాయాలు తగ్గి.. ఖర్చులు పెరిగిన పరిస్థితుల్లో అప్పులు పెంచుకుంటూ వెళ్లారని, చివరకు రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. 2019లో పరిపాలన ప్రారంభించిన తీరు ప్రజా వేదిక కూల్చివేతతోనే స్పష్టమైందని పేర్కొన్నారు. కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి మరీ ప్రజా వేదికను కూల్చారు. దీన్ని గర్వం అనాలా..? మదం అనాలా..? దీనికి పేరే లేదేమో..? అని సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో విధానపరమైన నిర్ణయాల కంటే విధ్వంసకర చర్యలకే గత ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. 2019–24 మధ్య రాష్ట్రాన్ని అన్ని విధాలుగా వెనక్కి నెట్టారని సీఎం అన్నారు. మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పురోగతి ఆగిపోయిందని, రోడ్ల నిర్వహణ సరిగాలేక గుంతలమయంగా మారాయని తెలిపారు. శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినడంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం తగ్గిందన్నారు. పరిశ్రమలు రావాల్సిన చోట ఉన్నవి కూడా వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని, కొత్త పెట్టుబడులు లేకుండా పోయాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం తీవ్రంగా దిగజార్చిందని చంద్రబాబు విమర్శించారు. నాటి ప్రభుత్వ నిర్వాకం వల్ల అప్పులు రూ.9.74 లక్షల కోట్లకు చేరాయని, అప్పులు తీర్చే సామర్థ్యం లేని రాష్ట్రంగా నీతి ఆయోగ్‌ పేర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆదాయాలు తగ్గుతున్నా ఖర్చులు మాత్రం పెరిగాయని, ప్రభుత్వ ఆస్తులు, భూములను తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రం దివాళా తీసే స్థాయికి చేరడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

కేంద్ర నిధులూ దారి మళ్లించారు

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన పథకాల నిధులను కూడా గత ప్రభుత్వం దారి మళ్లించిందని సీఎం ఆరోపించారు. కేంద్ర నిధుల వినియోగంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగా కేంద్రం ప్రత్యేకంగా చట్టం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులను నిర్దేశిత ప్రయోజనాలకే వినియోగించేలా వ్యవస్థను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నాటి ప్రభుత్వం… చివరకు మద్యం ఆదాయాన్ని ముందుగానే తాకట్టు పెట్టి రూ.25 వేలకోట్లు అప్పులు తెచ్చిందని చంద్రబాబు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీకి పూర్తి భిన్నంగా మద్యం ఆదాయాన్ని ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు ఉపయోగించారని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో కీలకంగా మారిందని సీఎం తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుందని వ్యాఖ్యానించారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పారు. కేంద్రం సాయం అందిస్తే దాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధిగా మలచుకునేందుకు సిద్దంగా ఉండాలన్నారు. ప్రజలు ఇచ్చిన ఓట్లతోనే ఇదంతా చేయగలుగుతున్నామని చంద్రబాబు అన్నారు.

ఆర్థిక వ్యవస్థను అడవి పందుల్లా ధ్వంసం చేశారు

అడవి పందులు పంటను నాశనం చేసినట్టుగా… నాటి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన రెవెన్యూ లోటు నిధులను కూడా ముందుగానే ఖర్చు చేశారని అన్నారు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో ఆగకుండా.. రాష్ట్ర భవిష్యత్తును మార్చే అనేక కీలక ప్రాజెక్టులను కూడా విధ్వంసం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి నగర నిర్మాణాన్ని నిలిపివేశారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులను మళ్లీ గాడిలో పెట్టామని, నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్నామని తెలిపారు. గతంలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రం నవ్వుల పాలైందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రపంచంలో అమరావతికి గుర్తింపు తీసుకొచ్చే ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. డిసెంబరులో క్వాంటం వ్యాలీని ప్రారంభిస్తామని, 2028లో అమరావతి ఫేజ్‌-1ను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని సీఎం స్పష్టం చేశారు. పోలవరంతోనే ఆగకుండా రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రూ.37,766 కోట్లతో 36 ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఉందని… ట్రిపుల్‌ రీజియన్ ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అమరావతి, తిరుపతి, విశాఖ కేంద్రంగా ఎకనమిక్‌ రీజియన్ల వారీగా అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు.

టెక్నాలజీని అడ్డుకోవద్దు

గతంలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB)ను రాష్ట్రానికి తీసుకొచ్చామని, ఇప్పుడు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ISA) ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ISA ఏర్పాటుకు రిలయన్స్‌ ముందుకొచ్చిందని వెల్లడించారు. డేటా సెంటర్లు వస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మాకెందుకు స్టీల్‌ ప్లాంట్‌.. మాకెందుకు ఏఐ.. మాకెందుకు డేటా సెంటర్లు అంటూ పేదరికంలోనే బాధపడాలా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు, ప్రజలకు ఆదాయం, రాష్ట్రానికి సంపద తీసుకొచ్చే పరిశ్రమలు, సాంకేతిక రంగాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల జీవితాలను మార్చేలా పబ్లిక్‌ పాలసీలు ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమం ఎంత ముఖ్యమో.. అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. మంచి రోడ్లు వేయాలన్నా.. మౌలిక వసతులు కల్పించాలన్నా.. సంపద సృష్టించాల్సిందేనని తెలిపారు. సంపద సృష్టికి కొత్త మార్గాలను అన్వేషించడంతోపాటు.. పెట్టుబడులను ఆకర్షించే విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలని ఆకాంక్షించారు. పరిశ్రమలు వస్తే ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుందో కియా కార్ల పరిశ్రమను ఉదాహరణగా సీఎం ప్రస్తావించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వల్లే ప్రజలు ప్రభుత్వాన్ని నమ్ముతున్నారని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *