-యూనిట్ రూ.1.50 చొప్పున ఈ నెల నుంచే అమలు
-ఆఫ్ స్టైల్ పొగాకుపై కిలోకు రూ.10 మద్దతు
-ఎల్ నినో సంక్షోభ నివారణ ప్రణాళికతో రైతుల వద్దకు
-ఆగస్టు 7 నుంచి రైతులకు అవగాహన కార్యక్రమాలు
-రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావం, ఆక్వా, పొగాకుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల నుంచే నాన్ ఆక్వా జోన్ లో ఉన్న ఆక్వా రైతులకూ రాయితీపై విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆక్వా జోన్ పరిధిలో ఇస్తున్నట్లే నాన్ ఆక్వా జోన్ లో ఉన్న రైతులకూ యూనిట్ విద్యుత్ ను రూ.1.5కే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల నుంచి దీనిని అమలు చేయాల్సిందిగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో ఇక జోన్లకు మాత్రమే పరిమితం కాకుండా ఆక్వా రైతులందరికీ రాయితీ విద్యుత్ అందుబాటులోకి రానుంది. ఈ నిర్ణయంతో 12,500 మంది ఆక్వా రైతులకు లబ్ది కలగనుంది. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం, లోటు వర్షపాతం, పంటల సాగు, జల వనరులు తదితర అంశాలపై వ్యవసాయ శాఖతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో సంక్షోభ నివారణ ప్రణాళికతో రాష్ట్రంలోని ప్రతీ రైతు వద్దకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రైతులు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ ప్రణాళికల్ని వారికి వివరించాలని సూచించారు. ఆగస్టు 7వ తేదీ నుంచి రైతులకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఎల్ నినో కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అక్టోబర్ మాసం వరకూ లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ ప్రణాళికలు అనుసరించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ప్రత్యేకించి పీఎండీఎస్ విధానంలో సాగు చేసేందుకు ఉన్న అవకాశాలను రైతులకు వివరించేలా రైతుల వద్దకు వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎల్ నినో లాంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో స్పష్టమైన విధానాన్ని రైతులకు అందించాలని అన్నారు. రైతు యాప్ ద్వారా పూర్తి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు వేగంగా అందించాలని స్పష్టం చేశారు. వర్షపాతం తగ్గి, సాగు విస్తీర్ణం పెరుగుతోందని క్షేత్రస్థాయిలో వస్తున్న ఈ మార్పులకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎల్ నినో ఎఫెక్ట్ మిటిగేషన్ యాక్షన్ ప్లాన్ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పశువుల దాణా విషయంలోనూ వీబీ జీ రామ్ జీ అనుసంధానించాలన్నారు.
ఆఫ్ స్టైల్ పొగాకు రైతును ఆదుకునేందుకు రూ.94 కోట్లు
ఆఫ్ స్టైల్ పొగాకుపై కిలోకు రూ.10 మద్దతు ధర ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రేపటి నుంచే ఇది అమల్లోకి రావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. 94 మిలియన్ కేజీల ఆఫ్ స్టైల్ పొగాకును కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీని ద్వారా 44 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, టొబాకో బోర్డు, రైతులు సహా 5గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి సమీక్షించాలని సీఎం నిర్దేశించారు. అలాగే ఎఫ్ సీవీ పొగాకు కొనుగోళ్లు ప్రస్తుతం 48.27 మిలియన్ కేజీల కొనుగోళ్లు జరిగాయని అధికారులు వివరించారు. రైతులను ఆదుకునేలా బ్యారెల్ కు రూ.50 వేల రుణం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఆక్వా సంక్షోభాన్ని నివారించేలా రొయ్య మేత ధరల నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. ఫిష్ మీల్ ఎగుమతులను 50 శాతానికి తగ్గించేలా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని సీఎం స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయం తీసుకునేంత వరకూ రొయ్యమేత ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాయలసీమను ఉద్యాన హబ్ గా తీర్చిదిద్దే అంశంపై వేగంగా ప్రణాళికలు అమలు చేయాలని సీఎం సూచించారు. త్వరలోనే 201 ఉద్యాన క్లస్టర్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇక నుంచి ప్రతీ మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై, ఎల్ నినో ప్రభావం నియంత్రణా చర్యలపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షకు మంత్రి కె.అచ్చెన్నాయుడు, సీఎస్ సాయి ప్రసాద్, వ్యవసాయ, జల వనరులు, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News