వైసీపీ నేరగాళ్ల ముఠా

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
-బీసీలను గండెల్లో పెట్టుకుంటున్నాం
-ప్రజల ఆశలు నిలబెట్టుకుంటూ పాలిస్తున్నాం
-కుర్చీ కోసమే జగన్ అరాచక యాత్రలు
-సొంత పార్టీ కార్యకర్తలను సైతం బలి తీసుకుంటున్నారు
-బాధిత కుటుంబాలను కాకుండా హంతకులకు పరామర్శ
-జగన్ వయస్సూ అయిపోయింది… ఆయన పని కూడా అయిపోయినట్లేనా..?
-గొడ్డలి పార్టీని భూస్థాపితం చేయండి
-ప్రజలకు మంత్రి సవిత పిలుపు

మంగళగిరి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల నుంచి ఏపీలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు శ్రమిస్తుంటే, అధికారం కోసం తన క్రిమినల్ బ్యాచ్ తో జగన్ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. సొంత పార్టీ కార్యకర్తలను సైతం బలిపెడుతున్న నేరగాళ్ల ముఠా వైసీపీ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైసీపీని పునాదులతో సహా భూస్థాపితం చేయాలని ప్రజలకు మంత్రి సవిత పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో సుపరిపాలనకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో, విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. పరిశ్రమలను ఆహ్వానిస్తూ, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భావితరాల భవిష్యత్తుకు బంగారు పునాదులు వేస్తున్నారన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు ఊరికే రావని, సీఎం చంద్రబాబు విజన్, నమ్మకమైన పాలన వల్లే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి తరలొస్తున్నారని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టులు నిర్మిస్తూనే.. ఒకవైపు ‘రైజింగ్ రాయలసీమ’, మరోవైపు ఉత్తరాంధ్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి సవిత తెలిపారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం

గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మంత్రి సవిత మండిపడ్డారు. ఏటా జాబ్ క్యాలెండర్, సంపూర్ణ మద్యపాన నిషేధం, రూ.3 వేల పెన్షన్ అంటూ ప్రజలను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. వచ్చేవారిని బెదిరించి, ఉన్న పరిశ్రమలను తరిమేసి రాష్ట్రాన్ని దశాబ్దాల వెనక్కి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపరిచిందన్నారు. హత్యా రాజకీయం, విద్వంసం, దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పాలన సాగించింది. బడుగు, బలహీన వర్గాలు, దళితులపై దౌర్జన్యాలు చేస్తూ రాష్ట్రాన్ని భూస్థాపితం చేశారని మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్రానికి స్పష్టమైన రాజధాని ఉండాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మి కూటమికి సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టారన్నారు. ప్రజలు ఏ ఆశతోనైతే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి సవిత వెల్లడించారు.

బీసీలను గుండెల్లో పెట్టుకుంటున్నాం

బడుగు, బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగానే జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారన్నారని మంత్రి సవిత మండిపడ్డారు. నాటి మహానాయకుడు నందమూరి తారక రామారావు కాలం నుంచి నేటి లోకేష్ వరకు టీడీపీ ఎల్లప్పుడూ బలహీన వర్గాలను గుండెల్లో పెట్టుకుని ఆదుకుంటోందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనకు, ఈ రెండేళ్ల కూటమి సుపరిపాలనకు తేడాను ప్రజలు గమనిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రం పరుగులు పెడుతోంది. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్నాం.

జగన్ కు సొంత పార్టీ కార్యకర్తలే పావులు…

శవయాత్రలు, పాదయాత్రల పేరుతో జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలనే బలి తీసుకునేలా రెచ్చగొడుతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత రాజకీయ లబ్ధి కోసం, కుర్చీ కాపాడుకోవడం కోసం ఎంతటికైనా తెగిస్తారన్నారు. వైసీపీ కార్యకర్తలు ఈ విషయాన్ని గ్రహించి అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. వైసీపీ కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు పాము పడగ కింద ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కార్యకర్తలను వాడుకోవడం జగన్ కు అలవాటుగా మారిందన్నారు. వైసీపీ అంతర్గత విభేదాలతో జయవర్ధన్ రెడ్డి, ఇబ్రహీంపట్నంలో భార్గవ్, రాంబాబు, కడపలో జగన్ మేనమామ చేతుల్లో దస్తగిరి, మాచర్లలో పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ముఠా చేతిలో చెన్నారెడ్డి బలయ్యారన్నారు. వివేకానంద రెడ్డి హత్య విషయం అందరికంటే ముందే జగన్‌కే తెలుసని వైఎస్ సునీత ఆనాడే తెలిపారన్నారు. అధికారం కోసం సొంత బాబాయినైనా, నమ్ముకున్న కార్యకర్తనైనా బలి తీసుకోవడానికి వైసీపీ వెనుకాడదని ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయని మంత్రి సవిత తెలిపారు.

జగన్ రెడ్డి పని అయిపోయినట్లేనా…?

వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదని, అది నేరస్తుల ముఠా అని మంత్రి సవిత మండిపడ్డారు. పలాసాలో పేద గొర్రెల కాపరి, నిరుపేద కుటుంబానికి చెందిన దానయ్య యాదవ్‌ను పొట్టనబెట్టుకుంటే, ఆ కుటుంబాన్ని జగన్ పరామర్శించలేదన్నారు. పైగా హంతకులను కలిసి భరోసా ఇస్తున్నారన్నారు. ‘చనిపోయిన వ్యక్తికి 44 ఏళ్లు దాటాయంటూ జగన్ అపహాస్యం చేయడం సరికాదన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్ వయసెంత..మీ వయస్సు అయిపోయింది కదా… మీ పని అయిపోయినట్లేనా.. కుర్చీ ఎక్కడానికి, పదవులు అనుభవించడానికి మీ వయసులు సరిపోతాయా’ అని ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తికి 44 ఏళ్లు అని చిన్నచూపు చూస్తూ, నిందితులను కాపాడేందుకు ప్రయత్నించడం బీసీ, బడుగు, బలహీన వర్గాల పట్ల జగన్‌కున్న అసలైన నైజానికి నిదర్శనమని బయటపడిందన్నారు. జగన్ శ్రీకాకుళం పర్యటనలో వైసీపీ నేత చింత రవి ఏకంగా విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా పోలీసుపైనే దౌర్జన్యానికి పాల్పడితే, మాజీ మంత్రి అంబటి రాంబాబు చట్టాన్ని గేలిచేస్తూ పోలీసులపై నిత్యమూ దాడికి దిగుతున్నారన్నాని మంత్రి సవిత మండిపడ్డారు.

గొడ్డలి పార్టీని భూస్థాపితం చేయండి

బడుగు, బలహీన వర్గాలు అన్ని రంగాల్లో ఎదగడానికి తెలుగుదేశం పార్టీయే పునాది వేసిందని మంత్రి సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రెండేళ్లలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమం, అభివృద్ధి వేగవంతంగా సాగుతున్నాయన్నారు. వైసీపీ రెచ్చగొట్టే రాజకీయాలను బడుగు వర్గాలు తిప్పికొట్టాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్లే నేడు దేశంలోనే అత్యధికంగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు తరలివస్తున్నాయన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఎక్కువగా లబ్ధి పొందేది బడుగు, బలహీన వర్గాల యువతేనని తెలిపారు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం పెట్టిన మొదటి సంతకం మెగా డిఎస్సీపైనే. కుల మతాలకు అతీతంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఈ మెగా డిఎస్సీ ద్వారా వేలాది మంది బీసీ, నిరుపేద నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించి లబ్ధి పొందారన్నారు. రాష్ట్ర భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే, అలజడులు రేపే గొడ్డలి పార్టీ ని ప్రజలంతా కలిసి శాశ్వతంగా భూస్థాపితం చేయాలని మంత్రిసవిత పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *