-కళలు మన సంస్కృతికి ప్రతిబింబం.. మన చరిత్రకు సాక్ష్యం
-కళాకారులకు గుర్తింపు, గుంటూరుకు గౌరవం తీసుకురావాలి
-“అమరావతి చిత్రకళా వీధి” ప్రారంభ కార్యక్రమంలో డా. పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సాంస్కృతిక కమిషన్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కొరటెపాడులో 2 రోజులపాటు నిర్వహిస్తున్న “అమరావతి చిత్రకళా వీధి” ప్రారంభ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు, శిల్పకారులు, విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
కళలు మానవాళి కనుగొన్న అత్యంత ప్రాచీనమైన భాష అని పెమ్మసాని అన్నారు. మనుషులు మాట్లాడక ముందే చిత్రాలు గీశారని, అక్షరాలు పుట్టక ముందే తమ ఆలోచనలను రాతిపై చెక్కారని తెలిపారు. వేల సంవత్సరాల క్రితం జరిగిన రాజకీయ చర్చలు మరుగునపడిపోయినా, ఆనాటి శిల్పాలు, కళారూపాలు మాత్రం నేటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయని చెప్పారు. ఇప్పుడు మనం సృష్టించే కళలు కూడా భవిష్యత్ తరాలకు చరిత్రగా మిగులుతుందని పేర్కొన్నారు.
కళలు ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబం, సమాజ చరిత్రకు సాక్ష్యం, ఒక తరానికి వారసత్వం, ఒక ప్రాంత సృజనాత్మకతకు ప్రతీక అని డా. పెమ్మసాని అన్నారు. కళలు కేవలం గోడల మధ్య ఉండకూడదని, ప్రజల మధ్యకు రావాలని, ప్రతి కళాకారుడికి స్ఫూర్తినిచ్చేలా, వారికి గౌరవం తీసుకువచ్చేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కల్చర్ అండ్ క్రియేటివిటీ చైర్‌పర్సన్ తేజస్విని పొడబాటిలకు డా. పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలంటే పట్టుదల, ప్యాషన్ ఎంతో అవసరమని అన్నారు.
గత సంవత్సరం రాజమండ్రిలో సుమారు 500 మంది కళాకారులతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించగా, ఈసారి గుంటూరులో దాదాపు 800 మంది కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చారని తెలిపారు. శంకర్ విలాస్ బ్రిడ్జి పనుల కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ, కళాకారులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పారు. కార్యక్రమం వల్ల ప్రజలకు కొంత అసౌకర్యం కలిగినా, కళాకారులను ప్రోత్సహించేందుకు గుంటూరు ప్రజలు సహకరించాలని కోరారు.
ప్రతి ఒక్కరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లేదా డాక్టర్ కాలేరని, ప్రతి వ్యక్తిలో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసే అవకాశాలు సమాజంలో ఉండాలని డా. పెమ్మసాని అన్నారు. కళలు ఎంతోమందికి ప్రశాంతతను అందించడంతో పాటు, వ్యక్తుల్లో కొత్త ఆలోచనలు, సృజనాత్మకతను పెంపొందిస్తాయని తెలిపారు.
గుంటూరు ప్రజలు “అమరావతి చిత్రకళా వీధి”ని సందర్శించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శిల్పకళ, జానపద కళలు, సాంప్రదాయ, ఆధునిక కళారూపాలను ఆస్వాదించాలని కోరారు. విద్యార్థులు కళాకారులతో మమేకమై వారి అనుభవాలను తెలుసుకుని, కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు.
కళాకారులకు గుర్తింపు, గుంటూరుకు గౌరవం, ఆంధ్రప్రదేశ్‌కు ఖ్యాతి తీసుకువచ్చేలా “అమరావతి చిత్రకళా వీధి” వంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని డా. పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News