-గీత జయంతి వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధ్యాత్మిక మార్గనిర్దేశం ద్వారా సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఏకాదశి, గీత జయంతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో 18 రోజుల పాటు గీత పారాయణం నిర్వహించారు. ఈ ముగింపు వేడుకలలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీత పారాయణం నిర్వాహకులు పార్థసారథి ని శాసనసభ్యులు సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గీతాసారాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు టిటిడి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలియజేశారు. గీత జయంతిని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో 18 రోజుల పాటు 18 ప్రతిష్ఠాత్మక దేవాలయాలలో గీత పారాయణం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సమాజంలో ఆధ్యాత్మిక కోణంలో ఎలా జీవించాలో భగవద్గీత తెలియజేస్తుందన్నారు. చిన్న వయస్సులోనే భగవద్గీత శ్లోకాలను శాస్త్రబద్ధంగా పఠించడం, దానిలోని సందేశం అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. కనుక ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా రోజుకో పేజీ అయిన భగవద్గీత చదవాలని సూచించారు. ఉత్తమ జీవన విధానానికి భగవద్గీత స్ఫూర్తినిస్తుందని అన్నారు. భగవద్గీత శ్లోక పఠనం వల్ల భక్తులలో జ్ఞానం, శాంతి, దయ, సద్భావన కలుగుతాయన్నారు. మానవుని పరమార్థాన్ని గీతాసారం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఇదే సందర్భంలో హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు.
Prajavartha Online Telugu News