-మధ్యంతర ఎన్నికల గూర్చి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం
-వైసీపీని ఎదుర్కొనే సత్తా తెలుగుదేశానికి లేదు
-పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముత్యాలంపాడు, వాంబే కాలనీ, లక్ష్మీనగర్, మధురానగర్, మాచవరం, గవర్నర్ పేట, రామకృష్ణాపురంలలో 2,500 కు పెంచిన పెన్షన్ లను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గత తెలుగుదేశం హయాంలో అస్తవ్యస్థంగా ఉన్న పింఛన్ల విధానాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి సరళీకకృతం చేశారన్నారు. పాలనలో ఎప్పటికప్పుడు నూతన విధానాలకు శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరిట సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దోచుకుతిన్నారని గుర్తుచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా సంక్షేమాన్ని ప్రజలకు ఇంటి వద్దకే అందజేస్తున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులను పిల్లలు చూడని ప్రస్తుత తరుణంలో.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా నిలిచారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ ను రూ. 2,500 పెంచి.. వారి జీవితాల్లో ఆనందాన్ని నింపారన్నారు.
మధ్యంతర ఎన్నికల గూర్చి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైసీపీతో పోటీ పడి జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడే సత్తా తెలుగుదేశానికి లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు జరిగిన ప్రతి ఎన్నికల నుంచి తెలుగుదేశం పారిపోవటమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు హడావుడిగా పెన్షన్ ను పెంచిన తెలుగుదేశం నేతలకు పెన్షన్లు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మల్లాది విష్ణు అన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందించే పింఛన్ పై కూడా రాజకీయాలు చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకరు చనిపోతే తప్ప రెండో వారికి పెన్షన్ రాని పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. కానీ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి దాకా రూ. 75 ఉండే పింఛన్ ను 2006 ఏప్రిల్ 1 నుంచి 200 కు పెంచారని గుర్తుచేశారు. ఆయన తనయుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నారన్నారు. శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతిఒక్కరికీ పింఛన్ అందించడం జరుగుతోందన్నారు.
వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి నెలా తొలి రోజే 95 శాతానికి పైగా లబ్ధిదారులకు నేరుగా ఇళ్ల వద్దకే పింఛన్లను అందిస్తున్నామని మల్లాది విష్ణు అన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న, సుదూర ప్రాంతాలలోని లబ్ధిదారులకు కూడా తొలి మూడు రోజుల్లోనే ఇవ్వడం జరుగుతోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం అందిస్తున్న 23,949 పెన్షన్లతో పాటుగా కొత్తగా మంజూరైన 972 పెన్షన్లను కలుపుకుని మొత్తం 24,921 మందికి ఈనెల నుంచి 2,500 రూపాయలు అందజేయబోతున్నట్లు మల్లాది విష్ణు గారు వివరించారు. దీని ద్వారా పింఛన్ దారులకు ప్రతినెలా రూ. 6 కోట్ల 35 లక్షల 40 వేలు లబ్ధి చేకూరనుందని తెలిపారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు పెనుమత్స శిరీష సత్యం, జానారెడ్డి, కొంగితల లక్ష్మీపతి, నాయకులు బెవర నారాయణ, అంగిరేకుల గొల్లభామ నాగేశ్వరరావు, ఆత్మకూరు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News