-మహిళలకు అన్ని పదవులలోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పించింది జగన్ ప్రభుత్వం..
-మహిళా దినోత్సవ సభకు 15 వేల మంది మహిళలు హాజరు అవ్వడానికి ఏర్పాట్లు..
-ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ మహిళా దినోత్సవాన్ని పండుగగా జరుపుకోవాలి..
-రాష్ట్ర మంత్రి శ్రీమతి తానేటి వనిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి, 8వ తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత అన్నారు.
విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ ఏర్పాట్లును రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘురామ్, మహిళా శిశు సంక్షేమ శాఖా ప్రధాన కార్యదర్శి అనురాధ, విజయవాడ మేయర్ రాయన భాగ్య లక్ష్మిలతో కలిసి ఏర్పాట్లపై బుధవారం అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా కారణంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించలేక పోయామని, ఈ సంవత్సరం ఘనంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, చట్ట సభల్లో, వివిధ ప్రజా ప్రతినిధులుగా 50 శాతం మహిళలకు కేటాయించి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్ష పాతిగా పేరు తెచ్చుకున్నారన్నారు. మార్చి, 8వ తేదీన ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం లో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొంటారని చట్ట సభల్లోని మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలు ఈ సభలో పెద్ద ఎత్తున పాల్గొంటారని మంత్రి తానేటి వనిత అన్నారు. మహిళా సాధికారికతలో మా ప్రభుత్వం ముందంజలో ఉందని, గత ప్రభుత్వం మహిళా సాధికారికతలో పెద్ద పీట వేశామని ప్రచారం మాత్రం చేసుకున్నాయని, మా ప్రభుత్వంలో ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళా సాధికారికతను చేతల్లో చేసి చూపించారని అన్నారు. రాష్ట్రంలో మహిళా శక్తి ఎలా ఉంటుందో విజయవాడలో మార్చి 8 న జరిగే బహిరంగ సభలో చూపిస్తామని మంత్రి తానేటి వనిత అన్నారు.
మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళలకు పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ ఇచ్చింది వై.సి.పి. ప్రభుత్వమేనని అన్నారు. మార్చి, 8వ తేదీన జరిగే మహిళా దినోత్సవంలో మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు 15 వేలమంది హాజరు అవుతారని అన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖా ప్రధాన కార్యదర్శి అనురాధ మాట్లాడుతూ మార్చి 8వ తేదీన ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఒక పండుగలా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారన్నారు. ప్రతి గ్రామానికి, ప్రతి హాబిటేషన్ కు మహిళా సాధికారికత విజయం చేకూరాలని మహిళలు మరింత ప్రగతి సాధించాలని మనందరం కోరుకుందామని అనురాధ అన్నారు. ఈ సమావేశంలో విజయవాడ కమిషనర్ క్రాంతి రాణా టాటా, విజయవాడ మునిసిపల్ కమిషనేర్ రంజిత్ బాషా, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News