-వేసవిలో 24x 7 విద్యుత్ సరఫరా పై ప్రత్యేక దృష్టి
-డిమాండ్ ఎంత పెరిగిన సరఫరాకు ఢోకా ఉండదు
-వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ పై స్పెషల్ ఫోకస్
-అవాంతరాలు లేని విద్యుత్ సరఫరాయే లక్ష్యం
-డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్ల నిర్వహణ పై నిరంతర పర్యవేక్షణ
-ఈ ఏడాది ఏప్రిల్ నాటికి విద్యుత్ డిమాండ్ రోజుకు 222.8 మిలియన్ యూనిట్లకు చేరవచ్చని అంచనా
-మార్చి నుంచి మే నెలల మధ్య విద్యుత్ డిమాండు 20,143 మిలియన్ యూనిట్ల అంచనా
-ప్రతి గృహానికి, పరిశ్రమకు , రైతులకు నాణ్యమైన ,నమ్మకమైన విద్యుత్ సరఫరా
-వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై ముఖ్యమంత్రి , ఇంధన శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి
-వేసవిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు – ఇంధన శాఖ కార్యదర్శి బి శ్రీధర్
-సబ్ స్టేషన్ లెవెల్ లో సమీక్ష యంత్రాంగం
-వినియోగదారుల సంతృప్తే లక్ష్యం
-గ్రామీణ విద్యుత్ సరఫరా పై నిరంతర సమీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండు దృష్టిలో పెట్టుకొని ఈ వేసవిలో వినియోగదారులకు 24x 7 నాణ్యమైన విద్యుత్ సరఫరా పై ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా అత్యంత కీలకంగా భావించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండా వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్ సరఫరాతో పాటు అత్యుత్తమ సేవలు కొనసాగేలా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ఆదేశించింది.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పై ఇంధన శాఖ కార్యదర్శి బీ శ్రీధర్ ట్రాన్స్కో, డిస్కమ్లతో టెలిఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉంటాయని ఆయన తెలిపారు . ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థలను ఆదేశించారు. రాష్ట్రం లో ప్రతి గృహానికి, పరిశ్రమకు , రైతులకు నాణ్యమైన ,నమ్మకమైన విద్యుత్ సరఫరా జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు.
ఇటీవల రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండడంతో పాటు , వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని 24x 7 విద్యుత్ సరఫరా పై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు.
విద్యుత్ డిమాండ్ పెరిగే కొద్ది వేసవి లో సహజంగా ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విద్యుత్ సంస్థలకు ఆదేశించినట్లు తెలిపారు. వేసవిలో నాణ్యమైన సరఫరా పై రాష్ట్ర ప్రభుత్వ అంచనాలను అందుకునేలా విద్యుత్ సంస్థలు కృషి చేయాలని విజ్ఞప్తి చేసారు . నూరు శాతం వినియోగదారులు సంతృప్తి చెందేలా విద్యుత్ సరఫరా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందన్నారు . ఈ మేరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. వినియోగదారుల సంతృప్తే విద్యుత్ సంస్థలకు అంతిమ లక్ష్యంగా ఉండాలని ఆయన స్పష్టం చేసారు . రాష్ట్రం లోని ప్రతి వినియోగదారునికి సత్వరమే అత్యుత్తమ సేవలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 5574 మిలియన్ యూనిట్లకు చేరుకుందని (11342 మెగా వాట్లు ) ఏ పీ ట్రాన్స్కో గ్రిడ్ అధికారులు వివరించారు . ఈ ఏడాది ఏప్రిల్ నాటికి విద్యుత్ డిమాండ్ రోజుకు 222.8 మిలియన్ యూనిట్లకు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ 240 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా. అనగా రోజుకు 18 మిలియన్ యూనిట్లు అదనంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
దీని పై ఇంధన శాఖ కార్యదర్శి స్పందిస్తూ విద్యుత్ డిమాండ్ అంచనాలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా అందుకు తగినట్లుగా స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేస్తున్నట్లు సూచించారు. ఈ ఏడాది మార్చి నుంచి మే నెలల మధ్య విద్యుత్ డిమాండు 20,143 మిలియన్ యూనిట్లు ఉంటుందని తెలిపారు. గత ఏడాది ఇదే కాలానికి 19,066 మిలియన్ యూనిట్లు ఉండగా ఈ ఏడాది 5.6 శాతం మేర విద్యుత్ డిమాండ్ పెరగనుందని అంచనా. విద్యుత్ డిమాండ్ పెరిగే కొద్ది సరఫరా లో ఏర్పడే సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రతి విద్యుత్ సబ్ స్టేషన్ స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన డిస్కాములను ఆదేశించారు.
సాంకేతిక అంశాలతో పాటు వినియోగదారుల సంతృప్తి విషయంలో వినియోగదారులు, ప్రత్యేకించి రైతుల నుంచి ఎప్పటికపుడు సమాచారం తీసుకోవాలని ఆయన కోరారు. ఆ సమాచారాన్ని విశ్లేషించుకుని మరింత అత్యుత్తమ సేవలు వారికి అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవాంతరాలు లేని విద్యుత్ సరఫరా కొనసాగేందుకు తగిన ముందు జాగ్రత్తలన్నీ తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్ల నిర్వహణ పై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని తద్వారా విద్యుత్ సరఫరా లో వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం తలెత్త కుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే వ్యవసాయ విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని వివరించారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవసాయానికి పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.
రాష్ట్రంలో జరిగే విద్యుత్ ఉత్పత్తికి తోడు , పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో తగిన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా పై ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి పెట్టిందని ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో సైతం విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆదేశించారని శ్రీధర్ తెలిపారు. ఈ దృష్ట్యా గ్రామాల్లో విద్యుత్ సరఫరా పై నిరంతర సమీక్షలను నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతల అభివృద్ధి, అక్కడప్రజల జీవన ప్రమాణాలు పెరగడంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేరొకొన్నారు .
ఏ పీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్/హెచ్ ఆర్ డీ & అడ్మిన్, ఐ.పృధ్వి తేజ్, జె ఎం డీ /విజిలెన్స్ & సెక్యూరిటీ, బీ మల్లా రెడ్డి, డిస్కమ్‌ల సి ఎం డీ లు హెచ్ హరనాథ రావు, జె పద్మ జనార్ధన రెడ్డి, కె సంతోషరావు, ఏపీ ట్రాన్స్కో డైరెక్టర్లు, కె ప్రవీణ్ కుమార్, కె ముత్తుపాండియన్, జెన్‌కో డైరెక్టర్ థర్మల్, జి చంద్రశేఖరరాజు, ఏ పీ ట్రాన్స్కో చీఫ్ ఇంజినీర్లు ఎవికె భాస్కర్, జి రాజబాబు, బి లక్ష్మీ వర మీరాకుమార్, డైరెక్టర్ ఆపరేషన్స్ ఏపీఈపీడీసిఎల్, బీ రమేష్ ప్రసాద్, ఏపీఎస్పీడీసిఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ , కళాధర్ బాబు, ఏపీసిపీడీసిఎల్ డైరెక్టర్ టెక్నికల్ , జయ భరత రావు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News