అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో చిన్నారులు, కౌమార బాలికల్లో రక్తహీనత, ఎదుగుదల లేకపోవం, పౌష్టికాహార లోపం నివారణకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో కోవిడ్-19 వ్యాక్సినేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు కౌమార బాలికల్లో రక్తహీనత, ఎదుగుదల లేకపోవడం వంటి కారణాలను విశ్లేషించి వారిలో పౌష్టికాహార లోప నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు.ప్రతి గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో మూడు నుండి 5మంది ఈవిధమైన లోపాలున్న పిల్లలను గుర్తించి ఒక నివేదిక రూపొందించాలని సిఎస్ ఆదేసించారు. ఇందుకు గాను వైద్య ఆరోగ్యం,విద్య,స్పెర్ప్, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్, త్రాగునీటి సరఫరా తదితర విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ,మహిళా శిశు సంక్షేమం, విద్యాశాఖల సమక్షంలో పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల హెల్తు చెకప్ ల నిర్వహణ కార్యక్రమాన్ని తరచూ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమర్ శర్మ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎస్సి, ఎస్టి తగితర మారుమూల గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. వైద్య ఆరోగ్యం, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల వద్ద ఉన్న డేటా బేస్ ను పరస్పరం పంచుకోవడం ద్వారా మెరుగైన రీతిలో చిన్నారులు, కౌమార బాలికల్లో రక్తహీనత, ఎదుగుదల లేకపోడం, పౌష్టికాహార లోప నివారణకు చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. అంతకు ముందు జాతీయ ఆరోగ్య మిషన్,కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై ఆయా శాఖల కార్యదర్శులు ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, స్త్రీశిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్ అనురాధ, వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ కె.భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News