అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటుపై సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు రోజులు వెళ్లాలన్నారు. ప్రతిరోజు నివేదికను తెప్పించుకుని సమీక్షిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. క్యాడర్ ప్రజలకు దగ్గర చేయాలని సూచించారు. బూత్ కమిటీలను బలోపేతం చేయాలి. బూత్ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలి. ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలి. ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. మే నెల నుంచి నెలలో 10 సచివాలయాలను సందర్శించాలి. ఒక్కో గ్రామ సచివాలయానికి వారంలో రెండు రోజులు వెళ్లాలన్నారు. ఏప్రిల్‌కల్లా జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలని తెలిపారు. కొత్త జిల్లాల వారీగా రీజినల్ కోఆర్డినేటర్లను నియమిస్తామన్నారు. జూలై 8న ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. మంత్రివర్గాన్ని కూడా పునర్ వ్యవస్థీకరిస్తాం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. 26 కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తాం అన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించామని దీనివల్ల మనం గర్వంగా ప్రజలకు దగ్గర వెళ్లగలమన్నారు. టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News