Breaking News

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మరో మంచి అవకాశం…

-ముఖ్యమంత్రి బడుగుబలహీన వర్గాల పక్షపాతి : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుు గోవింద రెడ్డి
-మార్చి 31వ తేదీ వరకూ అవకాశం : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది
-“వైఎస్ఆర్ బడుగు వికాసం” కింద ఓటీఎస్ ద్వారా భూముల పునరుద్ధరణ
-ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగదు చెల్లించే అవకాశం : ఏపీఐఐసీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బడుగుబలహీన వర్గాలకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకున్నారని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి వెల్లడించారు. భూముల పునరుద్ధరణ పాలసీ కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన భూములు అప్పగించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో పదేళ్లపాటు భూమిని లీజుకు కేటాయించేవారు. దానివల్ల రుణమంజూరు సమస్యలు తలెత్తేవని, ప్రభుత్వం దీన్ని గుర్తించి ఏప్రిల్ , 2008 నుంచి మార్చి , 2020 వరకూ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీ ద్వారా భూముల కేటాయింపులు పొంది వివిధ కారణాల వల్ల పరిశ్రమలు నెలకొల్పలేనివారికే ఈ అవకాశమని ఛైర్మన్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5వ తేదీన పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్ గారు ఇచ్చిన జీవో నంబర్-7 ఆధారంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు భూములను పునరుద్ధరించనున్నట్లు మెట్టు గోవింద రెడ్డి పేర్కొన్నారు.

“వైఎస్ఆర్ బడుగు వికాసం” కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మరింత మేలు చేసే దిశగా తాజా నిర్ణయం తీసుకుందని ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పదేళ్లుగా ప్రాజెక్టులో ఎటువంటి పురోగతి లేకపోవడం, నిర్ణీత సమయంలో బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడం, ప్రభుత్వపరంగా తలెత్తిన సమస్య పరిష్కారాలలో జాప్యం, చెల్లింపులు, జరిమానాలు కట్టలేని పరిస్థితుల్లో కూరుకుపోవడం వంటి కారణాలతో పారిశ్రామిక వేత్తల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఐఐసీ ఎండీ తెలిపారు. ప్లాట్లు పొంది రిజిస్ట్రేషన్లు చేసుకోకపోయినా, నగదు చెల్లించకపోయినా, తమ ప్లాటును, నగదును వెనక్కి తీసుకున్నా, ప్లాటు రద్దు అయినా మార్చి 31 లోగా జిల్లాల వారీగా ఏపీఐఐసీ కార్యాలయాల్లో వ్యక్తిగత దరఖాస్తులను నమోదు చేసుకోవాలన్నారు.

నగదు చెల్లింపుల విధివిధానాలు ఇలా…
లబ్ధిదారులకు ప్లాట్లు పొందిన నాటి ధరలను వర్తింపజేయడమే కాకుండా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగదు చెల్లించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తున్నట్లు ఏపీఐఐసీ స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తిరిగి కేటాయింపులకు సంబంధించిన లెటర్లు ఇవ్వడమే కాకుండా, 3 నెలలలోపు వడ్డీ లేకుండా నగదు చెల్లించేలా ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్ మెంట్) అవకాశం ఇచ్చినట్లు ఏపీఐఐసీ తెలిపింది. 91వ రోజు నుంచి 180 (3 నెలలు దాటి 6 నెలల లోపు) రోజుల వరకూ 4శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని, 181వ రోజు నుంచి రెండేళ్ల వరకూ 8 శాతం వడ్డీతో నగదు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత మార్గదర్శకాలను వెబ్ సైట్ లో పేర్కొంది. ఏపీఐఐసీ మార్గదర్శకాలను అనుసరిస్తూ పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేవారికే భూ కేటాయింపుల సేల్ డీడీ సాధ్యమని స్పష్టం చేసింది.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *