-పారదర్శకత జవాబుదారితనం ఉండాలి.
-ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలి.
-సీఎం ఆశయ సాధనే అందరి లక్ష్యం.
-రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పారదర్శకత జవాబుదారీతనం తో పుర ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. పట్టణ పరిపాలన, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ పై మూడు రోజుల పాటు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని పురపాలక, కార్పొరేషన్ లలోని అధికారులందరు ఈ శిక్షణ లో పాల్గొన్నారు. రెండో రోజు కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. సమస్యలను సవాలుగా స్వీకరించి పుర ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. ముఖ్యమంత్రి ఆశయ సాధనే మనందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. పారదర్శకత జవాబుదారీతనం అవినీతిరహిత పాలనలో భాగస్వాములు కావాలన్నారు. స్మార్ట్ సిటీలతో పాటు కొత్తగా జిల్లాల ఏర్పాటు తో 26 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో మెప్మా కార్యక్రమాలు అమలు కావాలన్నారు. వీధులు, పార్కుల పరిశుభ్రత పై ద్రుష్టి పెట్టాలన్నారు. పట్టణ పేదలకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన ఇళ్లను అందించాలనే కృత నిశ్చయం తో ఉన్నామని, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మేరకు డిసెంబర్ నాటికి 2.62 లక్షల ఇళ్ళు పూర్తి చేయాలనే సంకల్పం తో ఉన్నామని చెప్పారు. నిర్దేశించిన లక్ష్య సాధనకు ప్రణాళికతో దశలవారీగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. పట్టణాల్లో ఆక్రమణలపై ద్రుష్టి సారించాలని, ఇటువంటి విషయాల్లో అధికారులు అలసత్వం వహిస్తే తరువాత పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. మారుతున్న పరిస్థితులు, పట్టణాల్లో పెరుగుతున్న జనాభా దృష్టిలో ఉంచుకొని సాంకేతికత ను వినియోగించుకొని నాణ్యమైన వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. మంచి పురసేవలు, పేదల ఇళ్ళు ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అంశంగా తీసుకొని దానికి అనుగుణంగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో సిడిఎంఏ ప్రవీణ్ కుమార్, గ్రామ వార్డ్ సచివాలయాలు కమిషనర్ షన్మోహన్, ఎండి స్వచ్చంద్ర సంపత్ కుమార్, త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News