
-ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జిగా మణి నాయుడు రాక
-దక్షిణాది రాష్ట్రాలపై అరవింద్ కేజ్రీవాల్ దృష్టి
-ఆప్ ఏపీ రాజకీయాలను టార్గెట్ చేసిందా?
-ఈ నెల 24న విజయవాడలో ఆప్ రాష్ట్ర సమావేశం
-ఛండీగడ్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన మణి నాయుడు
-వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సరికొత్త రాజకీయ వ్యూహం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అవినీతిపై సమరం అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ని స్థాపించి, ఢిల్లీలో విజయ ఢంకా మోగించిన అరవింద్ కేజ్రీవాల్ ఇపుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించారు. పంజాబ్ లో అఖండ విజయం సాధించిన ఆయన ఆప్ అమ్ముల పొదిలో మరిన్ని రాష్ట్రాలను చేర్చుకోవాలని సంకల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హరియానా, రాజస్థాన్, గోవా తదితర రాష్ట్రాలలో తన మార్క్ చూపిస్తున్న ఆప్ ఇపుడు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లోనూ తన రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే, ఇప్పటి వరకు ఒక లెక్క, పంజాబ్ లో గెలిచాక ఇక మరో లెక్క అన్నట్లు ఆప్ రాజకీయ వ్యూహాలు మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇటు అధికార వైసీపీ, అటు తెలుగుదేశం పార్టీ ఢీ అంటే ఢీ అంటూ తలపడుతుండగా, ఈ రెండింటి వైఖరితో విసిగిపోయిన ఆంధ్ర ప్రజలకు సరికొత్త రాజకీయాలను పరిచయం చేయాలని ఆప్ భావిస్తోంది. అవినీతి రహిత పాలనను అందించడంతోపాటు, సామాన్యుడి నిత్యావసరాలను నాణ్యత ప్రమాణాలతో అందించడమే లక్ష్యంగా ఆప్ ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శూన్యతను భర్తీ చేసే పనిలోకి దిగుతోంది. ఢిల్లీ తరహాలో ఏపీలో అవినీతి రహిత పాలన, ప్రజా సంక్షేమం, విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు తదితర అభివృద్ధి కార్యక్రమాలను అందించేందుకు సరికొత్త తరహాలో పార్టీని సిద్ధం చేస్తోంది.
ఆప్ ఏపీ ఇన్ ఛార్జిగా మణినాయుడి నియామకం…
ఇంతకాలం ఆప్ దక్షిణాది ఇన్ ఛార్జిగా ఢిల్లీ ఆప్ నేత, ఎమ్మెల్యే సోమనాధ్ భారతీ వ్యవహించేవారు. ఇపుడు ఆయన స్థానంలో ఏపీకి ప్రత్యేకంగా కొత్త ఇన్ ఛార్జిని ఆప్ అధినేత కేజ్రీవాల్ నియమించారు. సోమనాధ్ భారతిని తెలంగాణాకు పరిమితం చేసి, ఆంధ్రప్రదేశ్ కు ఆర్.మణినాయుడిని కొత్తగా ఇన్ ఛార్జిగా నియమించారు. ఛండీగడ్ ఎన్నికల్లో ఆప్ పరిశీలకుడిగా పనిచేసిన మణి నాయుడు, ఎంతో రాజకీయ చతురతతో అక్కడి స్థానిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని అగ్రస్థానంలో నిలిపారు. ఆయన పొలిటికల్ ప్లానింగ్ గమనించి, ఇపుడు ఆంధ్రప్రదేశ్ కు కొత్త ఇన్ ఛార్జిగా కేజ్రీవాల్ ఆయన్ని నియమించారు. మణినాయుడు ప్రస్తుతం ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో ఆప్ ని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు, వచ్చే ఎన్నికల్లో ఆప్ ను ఒక నిర్ణయాత్మక శక్తిగా నిలిపేందుకు ఏపీ ఇన్ ఛార్జి ఆర్. మణినాయుడు రంగంలోకి దిగుతున్నారు. అవినీతిని ఊడ్చిపారేసే చీపురును ఏపీలో బలంగా ప్రయోగించాలని ఆప్ అధిష్ఠానం సంకల్పించింది.
ఈనెల 24న విజయవాడలో ఆప్ రాష్ట్ర సమావేశం…
ఈ నెల 24న విజయవాడలో ఆప్ రాష్ట్ర సమావేశాన్ని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నారు. దీనికి ఆప్ కొత్త రాష్ట్ర ఇన్ చార్జి ఆర్. మణినాయుడుతో పాటు రాష్ట్ర సలహాదారు పోతిన వెంకటరామారావు, కన్వీనర్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, తదితరులు హాజరవుతున్నారు. వీరితోపాటు ఈ సమావేశానికి ఏపీలోని అన్ని జిల్లాల నుంచి ఆప్ జిల్లా కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్నారు. రాష్ట్ర సమావేశంలో ఆప్ కొత్త రాజకీయ ప్రణాళికలతో పాటు, పార్టీ సభ్యత్వ కార్యక్రమం, కొత్త నేతలు పార్టీలోకి రాకలు ఉంటాయని ఆప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంభంపాటి కృష్ణమూర్తి తెలిపారు.
Prajavartha Online Telugu News