-ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రేరణ అందరికీ గర్వకారణం
-ఫ్రంట్‌లైన్ వారియర్స్, వలంటీర్ల సేవలు అభినందనీయం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
తమది మహిళా పక్షపాత ప్రబుత్వమని, గత ప్రభుత్వం నిర్వాకం వల్ల మహిళా సంఘాలు డీ గ్రేడ్ కి పడిపోతే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీ గ్రేడ్ కి పడిపోయిన స్వయం సహాయక సంఘాలకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పునర్జీవం కల్గించారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన గూడూరులోని సుమా కన్వెన్షన్ హాల్ లో డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీపై పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గూడూరు మండలంలో తొలిసారిగా పాల్గొనే అధికారక కార్యక్రమం కావడంతో మంత్రి జోగి రమేష్ కు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. తొలుత ఆయన పలువురు లబ్ధిదారులకు వ్యవసాయ పరికరాల పంపిణీ చేశారు. అనంతరం మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, గూడూరు మండలంలో 12 వేల 130 మంది అక్క చెల్లెమ్మలకు రూ. 97. 58 లక్షలు జమ కావడం ఎంతో సంతోషమన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని 9.76 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,02,16,410 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.1,261 కోట్ల వడ్డీ సొమ్ము నేరుగా జమ చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రధమం అని అన్నారు. ఈ సొమ్ముతో కలిపి ఇప్పటి దాకా ఈ పథకం కింద రూ.3,615 కోట్లు సాయం అందించినట్లయిందన్నారు. గతంలో 12శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చేదని పైగా సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన దాఖలాలు అందరికి విదితమేనని మంత్రి అన్నారు. పెడన నియోజకవర్గంలో 3 కోట్ల 70 లక్షల రూపాయలు అక్క చెల్లెమ్మల ఖాతాలలో జమ కాబడితే, కేవలం గూడూరు మండలంలో 73 లక్షల రూపాయలు జమ కాబడిందన్నారు. ఈ విధంగా పేద బలహీనవర్గాల మహిళలకు ఈ రుణం సొమ్ము అందచేయడం తప్పని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, అమరావతిలో మేడలు మిద్దెలు కట్టాలని అప్పుడే అభివృద్ధి చెందుతామని వింత వాదన చేస్తున్నారన్నారు. ఇంటికి దీపం ఇల్లాలు అని భావించి , మన రాష్ట్రంలో మహిళలు ఆర్ధికంగా స్థితిమంతులు కావాలనేది ముఖ్యమంత్రి సంకల్పం అని మంత్రి జోగి రమేష్ అన్నారు. శాశ్వతమైన సంపద విద్య మాత్రమేనని విద్యకు పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం పాఠశాలలో ఎన్నో వసతులు, చక్కని పౌష్ఠిక ఆహరం అందిస్తున్నదని ఉత్తమమైన నాణ్యతతో కూడిన విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత అయితే, ప్రతి మహిళ ఆ విషయం గుర్తెరిగి తమ బిడ్డలను చక్కగా చదివించేలా ప్రోత్సాహించాలని వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం వారి ముఖ్య బాధ్యత అని మంత్రి అన్నారు. కుల మత వర్గ పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందరికి రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తుందన్నారు. వైయస్ జగన్ సుపరిపాలని దేశంలో ఎందరికో ప్రేరణ, గర్వకారణమని మంత్రి జోగి రమేష్ ప్రశంసించారు. ఈ నియోజకవర్గం తనను రెండుసార్లు శాసనసభ్యునిగా సేవ చేసుకొనే భాగ్యం కల్పించిందని ఎవరైనా తనతో నేరుగా మొబైల్ ఫోన్లో మాట్లాడవచ్చని తన నెంబర్ 9848047522 సభాముఖంగా అందరికి తెలిపారు. తర్వాత, గూడూరు మండలంలో కరోనా కష్ట కాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు ఉత్తమ సేవలను అందించిన సేవ మిత్ర , సేవ వజ్ర 242 మందికీ 24 లక్షల 70 వేలు మెగా చెక్కు మంత్రి జోగి రమేష్ అందచేశారు. వీరిలో సేవారత్నలు మోపిదేవి ఇందిరా, సరిపల్లి సారికా, కిరణ్ బడుగు, రాజేష్ కోసూరి, గూడపాటి సాయిబాబు వాలంటరీ లకు ఐదుగురికి ఆయన స్వయంగా పురస్కారాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు జడ్పిటీసి వేముల సురేష్ రంగబాబు, సంగా మధుసూధనరావు పలువురు అధికారులు మండల ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు వాలంటీర్ లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News