విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రాహ్మణ మేధోమదన సదస్సు పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజకీయాలకు అతీతంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం గాంధీనగర్ హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. బ్రాహ్మణ జాతి ఐక్యతను చాటుకొని ఆర్థిక, రాజకీయ సామాజికాభివృద్ధికి బ్రాహ్మణుల సత్తా చాటే విధంగా డిసెంబర్ 25 న విజయవాడ వేదికగా బ్రహ్మగర్జన పేరిట భారీ సదస్సుని నిర్వహించాలని తీర్మాణం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ తెలిపారు. దీనికి అధ్యక్షత వహించిన దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షలకు పైగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఉందన్నారు . నేడు వారి ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రాహ్మణ సంఘాలన్నింటిని సమాఖ్య పరిచి తమ సత్తా చాటే దిశగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు అగ్రవర్ణం అయినా ఎక్కడా తగిన గుర్తింపు, ఆదరణకు నోచుకోవడం లేదన్నారు. వేదపండితులు, పురోహితులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందటం లేదన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పోరేషన్ కు సంవత్సరానికి 100 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ కు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తుందన్నారు. ఒకప్పుడు దేవాలయ భూములు పురోహితులు సాగు చేసుకొనేవారు, ప్రస్తుత ప్రభుత్వాలు ఆధీనంలోకి తీసుకోవటం వలన జీవనం కష్టం అవుతుందన్నారు. వేదపండితులుకు, పురోహితులకు, పేద బ్రాహ్మణులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేయటంతో పాటు 2024 ఎన్నికలలో కీలకంగా వ్యవహరించి బ్రాహ్మణ ఉనికిని చాటాలనే లక్ష్యంగా ముందుసాగుతామన్నారు. దానిలో భాగంగా డిసెంబర్ 25 న నిర్వహించే సభకు రాజకీయాలకు అతీతంగా బ్రాహ్మణసామాజిక వర్గం తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు . అందుకోసం అన్ని జిల్లాలో సభను విజయవంతం చేయాలని కోరుతూ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమావేశంలో అల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్, పురోహిత్ సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యామిజల నర్సింగమూర్తి, ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్, నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ , సింగర్ గజల్ శ్రీనివాస్ , ఏ పి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే.ఆర్ . సూర్యనారాయణ, ఆర్టిఓ కమీషనర్ ప్రసాదరావు , ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనేరు సతీష్ శర్మ, ప్రయాగ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News