విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైనార్టీలపై తెలుగుదేశం నేతలది కపట ప్రేమ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలోని ఈద్గా మసీదు నందు జరిగిన రంజాన్ వేడుకలలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మైనార్టీలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెద్దఎత్తున సంక్షేమాన్ని అందిస్తోందని.. అది చూసి ఓర్వలేక టీడీపీ ఒక ఏడుపు పార్టీగా తయారైందని విమర్శించారు. స్కీంల పేరిట గత తెలుగుదేశం నాయకులు పెద్దఎత్తున స్కాంలకు పాల్పడటంతో.. రంజాన్ తోఫా సహా తెలుగుదేశం అవినీతి పథకాలన్నింటినీ ప్రజలు తిరస్కరించారన్నారు. కనీసం మంత్రివర్గంలోనూ స్థానం కల్పించకుండా నాలుగున్నరేళ్లు ముస్లింలను దూరం పెట్టి అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు. ఆనాడు దివంగత మహానేత వైఎస్సార్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ తీసుకువస్తుంటే.. కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య, ఉపాధి రంగాలలో మైనార్టీ యువతకు పెద్దఎత్తున అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో మైనార్టీ విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తూ.. అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారన్నారు. ఐదుగురు ఉపముఖ్యమంత్రులలో ఒకరిని మైనార్టీ వర్గాల నుంచి ఈ ప్రభుత్వం ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉర్దూను రాష్ట్ర రెండో అధికారిక భాష హోదా కల్పించడంతో పాటు.. రాజకీయంగా ముస్లింలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు యరగొర్ల శ్రీరాములు, మైనార్టీ నాయకులు ఎస్.కె.సుభాని, ఇస్మాయిల్, భాష, ఎస్.కె.బాజీ, మత పెద్దలు, మస్లిం సోదరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News