-ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా వ్యాపారాలు సాగించాలి – కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్,
-సి.కె రెడ్డి రోడ్, ఫ్రూట్ మార్కెట్, దేవినగర్ ప్రాంతాల పర్యటన అధికారులకు పలు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ శుక్రవారం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా అధికారులతో కలసి సి.కె రెడ్డి రోడ్, కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్ రోడ్, దేవినగర్ మరియు అయోధ్యానగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ విధానమును పర్యవేక్షించారు. సి.కె రెడ్డి రోడ్, కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్ రోడ్ నందు ట్రాఫిక్ వ్యవస్థకు తీవ్ర అవరోధం కలించుటతో పాటుగా పరిసరాలు అన్నియు అపరిశుభ్రంగా వ్యాపారాలు ఇష్టానుసారంగా రోడ్లపై వ్యాపారాలు సాగించుట గమనించి అధికారులను వివరణ అడిగి పలు సూచనలు చేసారు. ఫ్రూట్ మార్కెట్ వద్ద స్థానిక వ్యాపారాలు అధిక మొత్తంలో చెత్త మరియు వ్యర్దములు ఎక్కడపడితే అక్కడ పడవేసి పరిసరాలు అన్నియు అపరిశుభ్రంగా తాయారు అవుతున్నందున అక్కడ వ్యాపారులకు చెత్త బుట్టలు ఏర్పాటు చేసుకొని నిర్దేశిత ప్రాంతాలలో మాత్రమే చెత్తను వేసుకొనే విధంగా అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేయాలని, అయినను రోడ్లపై చెత్తను పడవేసిన వారిని గుర్తించి అట్టి వారిపై జరిమానాలు విధించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా రోడ్లపై గంపలతో వ్యాపారం చేసుకోను వారి వల్ల ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగకుండా పోలీస్ శాఖా వారి సమన్వయంతో గతంలో వేసిన మార్జిన్ ప్రకారం మాత్రమే స్థానిక వ్యాపారాలు తమ యొక్క వ్యాపారాలు సాగించేలా చర్యలు తీసుకొనేలా చూడాలని సూచించారు.
తదుపరి దేవినగర్ నందు ఇంటింటి చెత్త సేకరణ తీరును పరిశీలించిన సందర్భంలో రోడ్ల అక్కడక్కడ చెత్త కుప్పలు ఉండుట గమనించి, ఇంటింటి చెత్త సేకరణ జరుగుతున్నపటికి చెత్తను పడవేయట పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, స్థానికులు ఎవరు రోడ్ల పై చెత్త పడవేయకుండా కేవలం చెత్త సేకరణ కొరకు వచ్చు పారిశుధ్య కార్మికులకు మాత్రమే అందించేలా ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు. సదరు ప్రాంతములో ఎన్ని నివాసాలు ఉన్నవి, ఎంత మందికి చెత్త బుట్టలు అందించినది మొదలగు వివరాలతో పాటుగా చెత్త సేకరణ సమయంలో ఎంత మంది నివాసాల వారు సిబ్బందికి చెత్తను అందిస్తున్నది వంటి వివరాలు అధికారులను అడిగితెలుసుకోన్నారు. ప్రజలకు అవగాహన కల్పించినప్పటికీ ఇంకను చెత్తను రోడ్లపై పడవేసిన వారిని గుర్తించి వారిపై జరిమానాలు విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
పర్యటనలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతబాయి, జోనల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజు, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటీశ్వరరావు, శానిటరీ సూపర్ వైజర్ యం.రమేష్, మరియు ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులు శానిటరీ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News