Breaking News

ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న పథకాలు అర్హులందరికీ అందాలి… : జిల్లా జడ్జి అరుణా సారిక

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు, సమన్యాయం, ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న పథకాలు అర్హులందరికీ అందాలనేదే న్యాయ సేవాధికార సంస్థ అభిలషిస్తున్నట్లు కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ అరుణా సారిక అన్నారు.
శనివారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ లో అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, గిరిజన హక్కుల రక్షణ, అమలు 2015 పథకాలకు ( నల్స ) సంబంధించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కొత్త కొల ప్రమాణ ( న్యూ మాడ్యూల్ ) న్యాయ సేవల శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి అరుణా సారిక మాట్లాడుతూ, ప్రజలందరికీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ఉచిత వైద్యం ఎలా అందుతుందో, అలాగే జిల్లాలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో పేద ప్రజలకు ఎలాంటి ఫీజు లేకుండానే ఉచిత న్యాయ సహాయం అందుతుందని చెప్పారు. దీనిపై తాము నిరంతరం ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నామని తెలిపారు. ఆర్టికల్ 39ఎ రూపంలో ప్రతి పౌరునికి న్యాయం అందాలని నిర్దేశిస్తుందని, ఆర్టికల్ 14, 27 (1) ప్రాకారం ప్రతి పౌరునికి సమన్యాయం సమాన అవకాశాలు కల్పించాలని సూచిస్తుందన్నారు. సమన్యాయం కల్పించాలనే ఉద్దేశ్యంతో 1987 లో యాక్టు వచ్చినప్పటికిని 1995 లో అమలులోకి తెచ్చి న్యాయ సేవల అధికార సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే మన దేశంలో గిరిజన చరిత్ర అతి పురాతనమైనదని వారి వికాసం ఎంతో భిన్నమైనదన్నారు. అడవుల్లో అనాదిగా ఆదివాసులు జీవిస్తున్నారని తమదైన సంస్కృతీ సంప్రదాయాలతో విలసిల్లుతున్న గిరి పుత్రుల అభివృద్దికి రాజ్యాంగ నిర్మాతలు వారి సంక్షేమంతో పాటు వారికి కొన్ని హక్కులను ప్రసాదించారని వారికోసం ప్రత్యేక చట్టాలు కూడా చేసారని ఆమె చెప్పారు. రాష్ట్రంలో 27.39 లక్షల గిరిజన జనాభా ఉందని అధికారిక సమాచారమని ఇది మొత్తం రాష్ట్ర జనాభాలో 5.53 శాతంగా ఉందన్నారు. వీరిలో అక్షరాస్యత శాతం 48.83. గిరిజన సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోందని వారి సమగ్రాభివృద్ధి కోసం రూపొందించిన ఎస్టీ సబ్ ప్లాన్ లో కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తోందని ఆమె తెలిపారు
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి. రంజిత్ బాషా ప్రసంగిస్తూ ప్రతి అసంఘటిత కార్మికుడు కార్మికుడిగా గుర్తింపు పొందాలని, తద్వారా ప్రమాద బీమా, సామాజిక భద్రత పథకాలకు అర్హులవుతారని వలస, అసంఘటిత కార్మికులను గుర్తించి చట్టాలు గూర్చి అవగాహన కల్పించడానికి , గిరిజన హక్కుల రక్షణ, అమలుపై పూర్తి చిత్తశుద్ధితో ఉన్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులందరీ పేర్లను ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసి వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలు అమలయ్యేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కోరారు. స్వయం సహాయక సంఘాలు, జాబ్‌కార్డు ఉన్న ఈజీఎస్‌ కూలీలు, వ్యవసాయకూలీలు, ఆశావర్కర్లను ఈపోర్టల్‌లో నమోదు చేయించాలని అధికారులకు వివరించారు. ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకునే విధంగా గ్రామాల్లో 16 నుంచి 59 ఏళ్లలోను ఉన్న భవన నిర్మాణ, రిక్షా, వ్యవసాయ, మత్స్య, పారిశుద్ధ్య, బీడీ కార్మికులు, ఈజీఎస్‌ కూలీలు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, తోపుడు బండ్లు, చిరువ్యాపారులకు అవగాహన కల్పించి నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌లతో అన్ని మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో సీఎస్సీలు, మీసేవా కేంద్రాల్లో ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని,నమోదైన వారికి యూనివర్సల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌తో ప్రత్యేక గుర్తింపుకార్డు జారీ చేస్తారన్నారు.
అనంతరం జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ మాట్లాడుతూ, ప్రభుత్వం పోలీస్ శాఖకు 4 జి లను నిర్ములించడానికి ఆదేశించడం జరిగిందని అందులో గంజాయి, గుడుంబా, గుట్కా, గ్యాంబ్లింగ్ ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో అమలు జరుగుతున్న వివిధ ప్రభుత్వ పథకాలలో ఏదైనా ఇబ్బంది జరిగితే లబ్ధిదారులు నేరుగా తమని సంప్రదించవచ్చని బాధితులకు తప్పక న్యాయం చేస్తామని ఎస్పీ అన్నారు.
మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల శివరామ కృష్ణ ప్రసాద్ జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు జడ్జి చిన్నంశెట్టి రాజు చట్టాల పై అవగాహన కల్పించారు.
తొలుత నూజివీడు ప్రాంతానికి చెందిన ఆదివాసీ యువతుల సాంప్రదాయ నృత్యం చూపరులకు కనువిందు చేసినది. జిల్లా కార్మిక శాఖ ఉప సంచాలకులు ఆశారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి సుహాసిని దేవి, ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సువర్ణ, బీ సి, ఎస్సి , గిరిజన సంక్షేమ శాఖ తదితర అధికారులు ప్రభుత్వ పథకాలు గూర్చి వివరించారు. లీగల్ సర్వీసెస్ వర్క్ షాప్ తో పాటు వివిధ శాఖల అధికారులు ఏర్పాటుచేసిన స్టాల్స్ పలువురిని ఆకట్టుకొన్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *