Breaking News

గంజాయి, మాదకద్రవ్యాలకు యువత అలవాటు పడకుండా అవగాహన కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గంజాయి, మాదకద్రవ్యాలకు యువత అలవాటు పడకుండా అవగాహన కల్పించటం, అమ్మకాలపై గట్టి నిఘా ఉంచి జిల్లాను గంజాయి, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరి సలహాలు సూచనలతో ముందుకు వెళదామని జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు అన్నారు. యువతను గంజాయి, డ్రగ్స్ మాదక ద్రవ్యాల వాడక విష సంస్కృతి నుండి రక్షించి చెడు వ్యసనాలకు బానిస కాకుండా తీసుకోవలసిన చర్యలపై ఆదివారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులు, వైద్యనిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వారి సలహాలు సూచనలను కోరారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి పేద, ధనిక, యువత, విద్యార్ధి అనే తేడాలు లేకుండా ప్రపంచాన్ని కుదిపేస్తుందని ఆవేధన వ్యక్తం చేశారు. చాలా మంది తెలియకుండానే డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని అన్నారు. ఒక్కసారి డ్రగ్స్ కు బానిసలు అయితే చావే శరణ్యం అనే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. డ్రగ్స్ ఉపయోగించడం వలన ఆరోగ్యపరంగా నష్టపోవడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడుతాయని, తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలని తుడిచేసి వారి క్షోభకు కారకులు అవుతున్నారని ఈ విష సంస్కృతిని రూపుమాపేందుకు సలహాలు, సూచనలను కలెక్టర్ కోరారు.

సబ్ కలెక్టర్ జిఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ ఇటీవల డ్రగ్స్ వాడకం జిల్లాలో పెరగటం ఆశ్చర్యానికి గురి చేస్తుందనిఅన్నారు. దీనిపై ఇటీవల విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల ప్రధానోపాధ్యాయులతో అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. నగరంలోని మురికివాడల లోని కొన్ని ప్రాంతాల్లో నిషేధిత డ్రగ్స్ వాడకం, అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. కళాశాలలు పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలో ఎక్కడా కూడా నిషేధిత సిగరెట్లు గుట్కా, ఖైనీ పంట ఉత్పత్తులు అమ్మకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కళాశాలలో యాంటీ ర్యాగింగ్ క్లబ్బులు మాదిరిగా యాంటీ డ్రగ్ ఎడిక్షన్ క్లబ్ లను ఏర్పాటుచేసి దీనిపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ మాదిరిగా వాట్సాప్ ను క్రియేట్ చేసి మత్తుపదార్థాల వాడకం, అమ్మకాలపై సమాచారాన్ని ఎవరైనా అందించే విధంగా ఏర్పాటు చేద్దామని సూచించారు.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జాషువా మాట్లాడుతూ నిషేధిత డ్రగ్స్ గంజాయి, గుట్కాకు సంబంధించిన అమ్మకాలు, నిల్వలపై సమాచారం అందించిన వారికి ప్రోత్సాహక రివార్డు అందిస్తే బాగుంటుందని సూచించారు.

ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి డాక్టర్ సమరం మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా డ్రగ్స్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు కౌన్సిలర్లను నియమించుకొని జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. యువత డ్రగ్స్ కు అలవాటు పడకుండా అవగాహన కల్పించే విధంగా జిల్లా స్థాయిలో సెమినార్ ఏర్పాటు చేద్దామని సూచించారు.

ప్రముఖ సైకియాట్రిస్ట్ వైద్య నిపుణులు రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ దురదృష్టవశాత్తు 10 సంవత్సరాల వయస్సు నుండే పిల్లలు డ్రగ్స్ కు బానిస అవుతున్నట్లు తాను గుర్తించానన్నారు. చిన్న వయసులోనే ఆల్కహాల్ డ్రగ్స్ కు అలవాటు పడితే మానసిక ఎదుగుదల మందగించి దీనిపైనా ఆసక్తి ఉండకుండా చిరాకు పడుతూ పిచ్చిగా ప్రవర్తిస్తారన్నారు. ఇటీవల నెయిల్ పోలిష్, వార్నిష్ వంటి వాటిని యువత మత్తు కోసం వినియోగిస్తున్నారన్నారు.విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సమన్వయంతో వీటి వాడకం పై గట్టి నిఘా ఉంచాలన్నారు. ఆన్ లైన్ ఓటీటీ సినిమాలు, షోలలో మత్తుపదార్థాల వాడకానికి సంబంధించిన ఎటువంటి హెచ్చరిక లేకుండా ప్రదర్శిస్తున్నారని దీనిపై కేంద్ర ప్రభుత్వ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ కు సూచించారు. తల్లితండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా ఉంచాలని అన్నారు. ఆర్థిక పరిస్థితిసరిగా లేక కొంతమంది మత్తు పదార్ధాలు అమ్మకం ఓ వ్యాపారంగా చూస్తున్నారని అటువంటి వారికి వేరేవృతి చేసుకునేలా ఆర్థికంగా తోడ్పాటు అందించాలన్నారు.

హెల్త్ కేర్ సోషల్ వర్కర్ అన్నమ్మ మాట్లాడుతూ చిన్న వయసులో మత్తుపదార్థాలనువాడి, నేరాలకు పాల్పడిన చిన్నపిల్లలను అబ్జర్వేషన్ హోమ్ లో ఉంచి బయటకు వచ్చిన వెంటనే గంజాయి ,డ్రగ్స్, మాదక ద్రవ్యాలను కొంతమంది వీరి ద్వారా వ్యాపారం చేయిస్తూ బానిసలను చేస్తున్నారన్నారు. అటువంటి వారిపై గట్టి నిఘా ఉంచాలని కోరారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, మేధావులు ,నిపుణులు అందించిన సలహాలను సూచనలను పరిగణలోకి తీసుకొని మన జిల్లాను డ్రగ్స్ ప్రీ (రహిత)జిల్లా గా తీర్చిదిద్ది దేశం, రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా గుర్తింపు తీసుకు వద్దామని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *