Breaking News

చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-64 వ వార్డు 281 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సుపరిపాలన చూసి చంద్రబాబు ఓర్వలేక‌పోతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64 వ డివిజన్ – 281 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సోమవారం అపూర్వ ప్రజాదరణతో దిగ్విజయంగా సాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు, పార్టీ శ్రేణులతో కలిసి కొండాలమ్మ తల్లి గుడి రోడ్డు, రామాలయం గుడి రోడ్డు, అంగన్వాడీ స్కూల్ పార్కు రోడ్డు, సుబ్బారెడ్డి హైస్కూల్ ఏరియా కాలనీలలో విస్తృతంగా పర్యటించారు. వార్డు సచివాలయ పరిధిలోని 1,617 గృహాలలో, 800 గడపలను సందర్శించారు. అన్ని వర్గాల ప్రజలను పేరుపేరున పలకరిస్తూ వినతులు స్వీకరించారు. సైడ్ కాల్వలలో సిల్ట్ ను ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. పగుళ్లిచ్చిన కాల్వలను పున: నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పట్టాలు మంజూరైన లబ్ధిదారులకు క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సచివాలయ సిబ్బందికి తెలిపారు. అలాగే శిథిలావస్థకు చేరి పెచ్చులూడిపోతున్న ఇళ్లను పునర్మించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న సాయంపై పేదలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ ప్రాంతంలో పెచ్చుమీరుతోన్న గంజాయి బ్యాచ్ పై ఉక్కుపాదం మోపాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక కమ్యూనిటీ హాల్ వద్ద గట్టి నిఘా పెంచాలన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా, ఈవ్ టీజింగ్ కి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దన్నారు.

పార్కు సుందరీకరణకు తక్షణ చర్యలు
గత తెలుగుదేశం హయాంలో నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి నోచుకోని పార్కులన్నింటినీ పచ్చదనం పరిఢవిల్లేలా అభివృద్ధి పరుస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక పార్కుకు రెండు రోజుల్లో శంకుస్థాపన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పార్కులోని పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి చదువును చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కాలనీ ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచే విధంగా పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. చిన్నారులను ఉల్లాస పరిచే విధంగా, విశాలమైన వాకింగ్ ట్రాక్ తో పార్కును అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

284వ వార్డు సచివాలయ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 5.12 కోట్ల సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 490 మందికి ప్రతినెలా రూ. 12.47 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 424 మందికి రూ. 54.90 లక్షలు., విద్యాదీవెన ద్వారా 156 మందికి రూ. 9.13 లక్షలు., వసతి దీవెన ద్వారా రూ. 3.13 లక్షలు., వైఎస్సార్ ఆసరా ద్వారా 716 మందికి రూ. 3.58 కోట్లు., జగనన్న తోడు ద్వారా 60 మందికి రూ. 6 లక్షలు., చేయూత ద్వారా 162 మందికి రూ. 30.37 లక్షలు., వాహనమిత్ర ద్వారా 84 మందికి రూ. 8.40 లక్షలు., కాపు నేస్తం ద్వారా 48 మందికి రూ. 7.20 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 19 మందికి రూ.2.85 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5.07 కోట్ల సంక్షేమాన్ని నగదు బదిలీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసినట్లు తెలియజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డికి మంచి పేరు, ప్రఖ్యాతలు వస్తుంటే ప్రతిప‌క్ష నేత చంద్రబాబు తట్టుకోలేకపోతున్నార‌ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దావోస్ పర్యటనపై పచ్చ మీడియా, తెలుగుదేశం నేత‌లు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. 32 సార్లు విదేశీ పర్యటనలు చేసిన చంద్రబాబు రూ. వందల కోట్ల నిధులు దుర్వినియోగం చేయడం తప్ప సాధించిందేమీ లేదని గుర్తుచేశారు. సీఎం జగన్ ఒక్క పర్యటనతో పచ్చ నేతలలో వణుకు మొదలైందని పేర్కొన్నారు. సీఎం జగన్ ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక.. దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉద్యోగావకాశాలే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న దావోస్ పర్యటనపై విషం కక్కుతున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి 150 మంది ఎమ్మెల్యేలతో సహా అధికార యంత్రాంగమంతా ప్రజల మధ్యనే ఉందని మల్లాది విష్ణు వెల్లడించారు. కనుక అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, పట్టాభి నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోయే స్థితికి చేరడానికి గత తెలుగుదేశం ప్రభుత్వం అసమర్థ, చేతగాని పాలనే ప్రధాన కారణమని మల్లాది విష్ణు అన్నారు. వ్యవస్థను కాపాడి, తిరిగి నిలబెట్టేందుకు విద్యుత్ ఛార్జీలను స్వల్పంగా మాత్రమే పెంచడం జరిగిందని తెలిపారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ టారీఫ్ ఛార్జీలు దేశంలో ఏపీలోనే స్వల్పమని ఉద్ఘాటించారు. ఈ వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యేలా గడప గడపకు తిరిగి వివరిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, 30వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ జానారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు యర్రగొర్ల శ్రీరాములు, అలంపూర్ విజయ్, మోదుగుల గణేష్, అక్తిశెట్టి నారాయణ, ఎస్. కె. ఇస్మాయిల్, మేడా రమేష్, జె. డి. కృప, కొక్కిలిగడ్డ నాని, పరిమి నాగేశ్వరరావు, వెంకటేశ్వరమ్మ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *