-ఎమ్మెల్యే చేతులమీదుగా ‘సామాజిక న్యాయ భేరీ’ పోస్టర్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కలలు కన్న సమసమాజ నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చేసి చూపిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సామాజిక న్యాయ భేరీ పేరిట వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29 వరకు విజయనగరం నుంచి అనంతపురం వరకు నిర్వహిస్తున్న బస్సు యాత్ర పోస్టర్లను ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సామాజిక విప్లవాన్ని బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. కేబినెట్ లో ఆయా వర్గాలకు చెందిన 17 మందికి (77 శాతం) మంత్రి పదవులు కేటాయించడం చారిత్రాత్మకమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారం కల్పించాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పదవులతో పాటుగా రాజ్యసభ, శాసనమండలిలోనూ అగ్రతాంబూలం ఇవ్వడం జరిగిందన్నారు. అదే గత చంద్రబాబు పాలనలో ఎన్నికలు సమీపిస్తే తప్ప మైనార్టీలు గుర్తుకు రాలేదని మల్లాది విష్ణు విమర్శించారు. గిరిజనులకు కనీసం కేబినెట్ లో స్థానం కల్పించలేదని గుర్తుచేశారు. బడ్జెట్ లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీరని ద్రోహం చేశారన్నారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా రూ. లక్షా 50 వేల కోట్ల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు అందజేస్తే.. అందులో 85 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించారన్నారు. సామాజిక న్యాయం కోసం ఈ ప్రభుత్వం ఎంతగా పరితపిస్తోందో ఇక్కడే మరోసారి స్పష్టమైందన్నారు.
నాలుగురోజుల పాటు సాగే బస్సుయాత్రలో 26న విజయనగరంలో, 27న రాజమండ్రిలో, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ బస్సు యాత్ర 28వ తేదీన విజయవాడ నగరంలో ప్రవేశిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా రామవరప్పాడు నుంచి వారధి వరకు పార్టీ నాయకులు, శ్రేణులు పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి బస్సు యాత్రకు స్వాగతం పలుకనున్నట్లు వివరించారు. మరోవైపు 32 సార్లు విదేశీ పర్యటనలు చేసిన చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి దావోస్ వెళితే తట్టుకోలేకపోతున్నారని మల్లాది విష్ణు అన్నారు. విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రజంటేషన్ లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఆయన పడుతున్న తపన చూసి ప్రజలు మరలా ఎక్కడ బ్రహ్మరథం పడతారేమోనన్న భయంతో తెలుగుదేశం నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కనుకనే ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని బస్సు యాత్ర ద్వారా మరోసారి సమర్థవంతంగా త్రిప్పికొడతామన్నారు. కావున పార్టీ శ్రేణులందరూ పెద్దఎత్తున పాల్గొని సామాజిక న్యాయ భేరీకి పూర్తి మద్ధతును అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అలంపూరు విజయలక్ష్మి, ఇసరపు దేవి, కొండాయిగుంట మల్లీశ్వరి, పెనుమత్స శిరీష సత్యం, కుక్కల అనిత రమేష్, శర్వాణీ మూర్తి, బాలి గోవింద్, జానారెడ్డి, కొంగితల లక్ష్మీపతి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, డివిజన్ ఇంఛార్జిలు గుండె సుందర్ పాల్, నాయకులు అలంపూర్ విజయ్, మోదుగుల గణేష్, ఇసరపు రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News