Breaking News

జగనన్న తోడుతో చిరు వ్యాపారుల‌కు ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-25వ డివిజన్ 94 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పేదలందరికీ నవరత్నాల పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 25 వ డివిజన్ 94 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం కోలాహలంగా సందడి వాతావరణంలో సాగింది. అధికారులు, పార్టీ శ్రేణులతో కలిసి ఎంప్లాయిమెంట్ ఆఫీస్ స్ట్రీట్ తో పాటు చుట్టుగుంట కాల్వ వంతెన నుంచి కొత్త వంతెన వరకు కాల్వ గట్టు వెంబడి వీధులలో ఎమ్మెల్యే పర్యటించారు. దాదాపు 310 గడపలను సందర్శించి.. వినతులు, సూచనలు స్వీకరించారు. త్రాగునీరు, డ్రెయిన్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రజలందరికీ అనువైన సమయాలలో త్రాగునీరు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే కాల్వగట్టు వెంబడి వీధులలో కూలిన సైడ్ కాలువలను తిరిగి నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. డ్రెయిన్లు పొంగకుండా ఎప్పటికప్పుడు సిల్ట్ మెషిన్ల ద్వారా ఎత్తివేయాలన్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు నమోదు చేసుకున్న సమస్యలపై వారాంతంలో యాక్షన్ టేకెన్ రిపోర్టు తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు. దీని ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు వేసిన కేసుల కారణంగా దాదాపు 10 వేల మంది పేదలకు సీఆర్డీఏ పరిధిలో కేటాయించిన ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయిందన్నారు. వీరందరికీ నగర సమీపంలో ఇళ్ల పట్టాలు కేటాయించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థలాన్వేషణలో ఉన్నట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా పట్టాల పంపిణీ పూర్తిచేస్తామని తెలియజేశారు.

పర్యటనలో భాగంగా పలువురు చిరువ్యాపారులతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముచ్చటించారు. జగనన్న తోడు పథకం ద్వారా అందిన సాయంపై తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయాలు విక్రయించేవారు, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లు అమ్మే చిరువ్యాపారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని తమ ఆర్థిక పురోభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. కరోనా కారణంగా ఉపాధి లేక ఆర్థికంగా చితికిపోయిన వీధి వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు చేయూతనందించేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడిందని చెప్పుకొచ్చారు. దీని ద్వారా చిరు వ్యాపారులకు వడ్డీలేకుండా రూ.10వేలు అందుతుందని, ఈ రుణం సంవత్సర కాలంలో వడ్డీలేకుండా చెల్లించాల్సి ఉంటుందన్నారు. రుణం చెల్లిస్తే మరోసారి రూ.10వేలు తీసుకునే అవకాశం ఉందన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరం 1,831 మందికి రూ.4,96,117 వడ్డీ జమ చేయటం జరిగిందన్నారు. అంతే కాకుండా మరో 318 మందికి రూ. 31.80 లక్షలు మూడో విడత కింద రుణాలు అందజేసినట్లు పేర్కొన్నారు.

94 వ వార్డు సచివాలయ పరిధిలో ఇప్పటివరకు రూ. 4.20 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వివరించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 302 మందికి ప్రతినెలా రూ. 7.67 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. చేయూత ద్వారా 74 మందికి రూ. 13.87 లక్షలు., కాపు నేస్తం ద్వారా 35 మందికి రూ. 5.25 లక్షలు., అమ్మఒడి ద్వారా 303 మందికి రూ. 42.42 లక్షలు., విద్యాదీవెన ద్వారా 73 మందికి రూ. 9.93 లక్షలు., వసతి దీవెన ద్వారా 73 మందికి రూ.3.86 లక్షలు., వాహనమిత్ర ద్వారా 15 మందికి రూ. 1.50 లక్షలు, వైఎస్సార్ ఆసరా ద్వారా 210 మందికి రూ. 3.90 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన చూసి రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నాయని మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఒక అజెండా అంటూ లేదని.. చంద్రబాబు అజెండాను ఫాలో అవుతూ ఈ ప్రభుత్వంపై బురద చల్లుతోందన్నారు. పేదరిక నిర్మూలనలో ముఖ్య భూమిక పోషిస్తున్న నవరత్నాల పథకాలను విమర్శించే స్థాయి సోము వీర్రాజుకు లేదని మండిపడ్డారు. బీజేపీ నాయకులు మాట్లాడే ముందు స్థాయి తెలుసుకుంటే మంచిదని సూచించారు. సోము వీర్రాజు వ్యవహార శైలి చూస్తుంటే.. ఆయన రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడా..? లేక టీడీపీ బీ టీమ్‌ కు అధ్యక్షుడో అర్థం కావడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ బినామీలని పక్కనపెట్టుకుని బీజేపీ పెద్దలు చేస్తున్న విమర్శలు చూస్తుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న ఆయుష్మాన్ భారత్ కు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకమే స్ఫూర్తి అని మల్లాది విష్ణు అన్నారు. పిఎం – కిసాన్ యోజన పథకం 2019 ఫిబ్రవరి 24న వచ్చిందని.. అంతకుముందే 2017 జూలై 8న గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్సార్ రైతు భరోసా పథకంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసినట్లు తెలిపారు. కనుక ఎవరి పథకాలను ఎవరు కాపీ కొడుతున్నారో విజ్ఞులైన ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల తర్వాత వరుసగా 6 ఎన్నికలలో ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారని మల్లాది విష్ణు తెలిపారు. ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్ సీపీకి ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చిందన్నారు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలలోనూ వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు బంకా భాస్కర్, మానం గంగాధర్, మానం వెంగయ్య, కోలంటి రవి, యక్కల మారుతి, చినబాబు, బంకా బాబి, ఆచారి, ఆలీ, భోగాది మురళి, పుల్లయ్య, నరేంద్ర, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *