Breaking News

ఏపీలో సామాజిక న్యాయం.. నభూతో నభవిష్యతి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-25వ డివిజన్ 95 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఎక్కడా లేని విధంగా కుల, మత, పార్టీలకతీతంగా అర్హత ఉన్న పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 25 వ డివిజన్ – 95 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశిష్ట స్పందన లభించింది. వార్డు సచివాలయ పరిధిలోని 1,127 గృహాలలో, 325 ఇళ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించారు. పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరుతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ది చేకూరిందని చెప్పడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి.. ముఖ్యమంత్రి సంతకం చేసిన ఉత్తరాన్ని, బుక్ లెట్‌ను ప్రజ‌ల‌కు అంద‌జేశారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోందని మల్లాది విష్ణు తెలిపారు. గత ప్రభుత్వంలో పథకాలు వర్తించాలంటే జన్మభూమి కమిటీ సభ్యులకు డబ్బులు చెల్లించాల్సి వచ్చేదని గుర్తుచేశారు. కానీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి అవినీతి లేకుండా.. అన్ని కులాలు, మతాలు, పార్టీల ప్రజలకు పెద్దఎత్తున సంక్షేమాన్ని అందించడం జరిగిందన్నారు. గత జన్మభూమి కమిటీల మాదిరిగా పథకాల అమలులో పక్షపాత ధోరణితో వ్యవహరించడం తమకు తెలియదన్నారు. విజయవాడ నగర చరిత్రలోనే ఇంత పెత్తున సంక్షేమం అందించిన ప్రభుత్వం వైఎస్సార్ సీపీ తప్ప మరొకటి లేదన్నారు.

పర్యటనలో భాగంగా పలువురు అగ్రిగోల్డ్ బాధితులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆర్‌బీఐ ఒప్పుకోదన్న కుంటిసాకుతో చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితుల బలవన్మరణాలకు, వారి కుటుంబాలు రోడ్డున పడడానికీ కారకులయ్యారని మల్లాది విష్ణు అన్నారు. పైగా అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవాలని గత పాలకులు తీవ్ర ప్రయత్నాలు చేశారని గుర్తుచేశారు. కానీ సీఎం వైఎస్‌ జగన్ పరిపాలనలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగిందని తెలిపారు. వార్డు సచివాలయం ద్వారా అగ్రిగోల్డ్ బాధితులను పారదర్శకంగా గుర్తించినట్లు వెల్లడించారు. బాధితులకిచ్చిన హామీని నెరవేర్చే ఉద్దేశంతో రెండు దశల్లో 10.4 లక్షల కుటుంబాలకు ఏకంగా రూ.905.57 కోట్లను ముఖ్యమంత్రివర్యులు విడుదల చేశారని వివరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 91,589 మందికి రూ. 82.46 కోట్ల నిధులు చెల్లించామన్నారు. రూ. 10 వేల లోపు డిపాజిట్ దారులు 54,027 మందికి రూ. 29.52 కోట్లు, రూ. 20 వేల లోపు డిపాజిట్ దారులు రూ. 37,562 మందికి రూ. 52.95 కోట్లు వారి ఖాతాలలో నేరుగా డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ ద్వారా మోసపోయిన డిపాజిటర్లలో ఎక్కువ మంది కష్టజీవులు, రోజువారీ కూలీలు మరియు ఫ్యాక్టరీ కార్మికులే ఉన్నారన్నారు. అటువంటి వారికి ఈ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. డబ్బులు పడని బాధితులకు సైతం త్వరలో నిధులు జమ అయ్యేలా చూస్తామని హామీనిచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. పేదలను ఆదుకుంటూ, అన్ని వర్గాల వారికి అండగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సామాజిక న్యాయం అనే పదం ఉచ్ఛరించడానికి కూడా అర్హత లేదని విమర్శించారు. రాష్ట్రంలో నభూతో నభవిష్యతి అన్నట్లుగా సామాజిక న్యాయం అమలు అవుతుంద‌ని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా ఉంటూ 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబుకి.. 151 సీట్లతో గెలుపొందిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు, తన హయాంలో అణగారిన వర్గాలకు ఏం చేశాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ కులాల వారికి తన కేబినెట్ లో కనీసం స్థానం కల్పించలేకపోయారన్నారు. కానీ అంబేడ్కర్, పూలే కలలుగన్న సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి కట్టుబడి ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు సీట్ల కేటాయింపు నుంచి పదవుల పంపిణీ వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి సమ న్యాయం చేశారని తెలిపారు. మంత్రివర్గం కూర్పు నుంచి నామినేటెడ్ పదవుల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దఎత్తున పదవులు కేటాయించడం ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించడం జరిగిందన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సామాజిక న్యాయంపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ పార్లమెంటరీ అధ్యక్షులు చంద్రగిరి విష్ణువర్థన్, నాయకులు బంకా భాస్కర్, గుండె సుందర్ పాల్, మానం గంగాధర్, అలీ, చినబాబు, అబ్దుల్ నజీర్, కోలంటి రవి, బంకా బాబి, రఫీ, పుల్లయ్య, జి.రామకృష్ణ, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *