Breaking News

జగనన్న కాలనీలు జగద్వితం

-నాడు ఐఈఏ(పారిస్ ), నేడు కెఎఫ్ డబ్ల్యు (జర్మనీ) ప్రశంస
-ఏపీ గృహ నిర్మాణ పథకంలో మరో మైలురాయి !
-ఇంధన సామర్థ్యానికి జర్మన్ ప్రభుత్వ KFW బ్యాంకు ఆర్థిక సాయం చేసేందుకు పరిశీలన
-రాష్ట్ర గృహనిర్మాణ అధికారులతో జులై రెండవ వారంలో మీటింగ్
-‘విద్యుత్తు సరఫరా, ఇంధన సామర్థ్యం’లో ఉత్తమ విధానాలపై చర్చ
-తొలి దశలో 15.6 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు
-పేదలకు అద్భుతమైన సొంత ఇల్లు ఉండాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం
-ఇళ్లలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు గృహ నిర్మాణ శాఖ మద్దతు
-పైలట్ ప్రాజెక్టుగా ‘కూల్ రూఫ్’.. ఫలితంగా ఇళ్లలో తగ్గనున్న 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత
-రూ.37 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు
-పేదలకు ఇళ్లు.. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం: మంత్రి జోగి రమేశ్
-గృహనిర్మాణ శాఖ లబ్ధిదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, నిర్మాణాలలో అత్యధిక నాణ్యతను కొనసాగించేందుకు కృషి చేస్తోంది
-హౌసింగ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ర్టంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన జగనన్న ఇళ్లు జగద్వితమవుతున్నాయి. ఇప్పటికే ప్యారిస్కు చెందిన ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ)కు చెందిన ప్రముఖులు కొనియాడారు. ఇటీవల భవనాల్లో ఇంధన సామర్ధ్యం – వాతావరణ మార్పులు అనే అంశం మీద గ్లోబల్ వెబినార్ జరిగింది. ఈ వెబినార్లో ప్రపంచ దేశాల నుండి దాదాపు 45 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నిపుణులు వారివారి సూచనలు, సలహాలు ఇచ్చారు. అందులో ప్యారిస్ కేంద్రంగా ఉన్న ఐఈఏ (ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ) అనే సంస్థ నుండి మేఖేల్ అనే అతను ఇటీవలికాలంలో మూడు మిలియన్ల మేర పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమమని కొనియాడారు. అంతేకాకుండా ఈ ఇళ్లలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు చేయడం మరో అద్భుతమన్నారు. దీనివల్ల 2.5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. అంతేకాకుండా వాతావరణ మార్పులకు సంబంధించి ఇది బాగా దోహదకారి అవుతుందన్నారు.

ఈ సంఘటన జరిగి నెల రోజులు గడచిన వెంటనే ఇప్పుడు జర్మన్ ప్రభుత్వ బ్యాంకుగా ఉన్న కెఎఫ్ డబ్ల్యు బ్యాంకు ప్రతినిధులు ఏపీలో జరుగుతున్న జగనన్న ఇళ్ల కార్యక్రమాన్ని పరిశీలించి, అందులో ఇంధన సామర్ధ్య చర్యల అమలుకు రూ. 150 మిలియన్ యూరోల మేర ఆర్ధిక సాయం అందించే అవకాశాలను పరిశీలిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కు , ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్కు సమాచారం అందించింది. అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు అదనంగా సహకారం అందించే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. వీటన్నింటి పరిశీలనకోసం జులై 11 నుండి 15 మధ్య ఏపీకి వచ్చి రాష్ట్ర గృహ నిర్మాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తో భౌతిక సమావేశం ఏర్పాటు చేస్తామని సమాచారం అందించారు. దీంతో రాష్ర్టంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలు జగద్వితమయ్యాయి. ఈ పురోగతిని స్వాగతిస్తూ .. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారీగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణాల్లో గృహ నిర్మాణ శాఖ బాధ్యతను మరింత పెంచిందని అజయ్ జైన్ తెలిపారు.

ఈ సందర్భంగా అజయ్ జైన్ మాట్లాడుతూ.. “ నవరత్నాల పేదలందరికీ ఇల్లు” కార్యక్రమం కింద మొదటి దశలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈక్రమంలోనే విద్యుత్ శాఖ సమన్వయంతో ఈ ఇళ్లలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయాలనే ఆలోచనతో గృహనిర్మాణ శాఖ ముందుకు వచ్చింది. దీని దృష్ట్యా గృహనిర్మాణ కార్యక్రమంలో ఇంధన సామర్థ్యానికి తోడ్పాటునందించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశాన్ని అధ్యయనం చేయడానికి, నిధుల కేటాయింపుకోసం ఉన్న పరిస్థితులను అన్వేషించడానికి జర్మనీలోని కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ ముందుకు వచ్చింది” అని ఆయన తెలిపారు.
ఈ నిర్ణయంతో రాష్ర్ట ప్రభుత్వం మొదటి దశలో నిర్మించనున్న15.6 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య చర్యలు అమలు చేయనున్నారు. ఫలితంగా లబ్దిదారులకు విద్యుత్ బిల్లులలో కొంత మేర ఆదా, అంతేకాకుండా ఇంధన సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే విధంగా సమర్థవంతమైన విద్యుత్ ఉపకరణాలను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించారు.

ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందించాలని ఆసక్తిగా ఉన్నట్లు కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ టీమ్ లీడర్ డాక్టర్ లక్స్ వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం పేదలకోసం నిర్మించే ఇళ్లలో ఉత్తమ విధానాలను పాటించడం, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం వంటివి ఉన్నాయి. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో నిపుణులైన మానవ వనరులను అందించనున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా తమ జర్మన్ బ్యాంక్ నుండి ఇంధన సమర్థవంతమైన గృహాల నిర్మాణం కోసం 150 మిలియన్ల యూరోల వరకు ఆర్ధికసాయం అందించాలని భావిస్తున్నామన్నారు. అలాగే ప్రాజెక్ట్ విజయవంతమైన అంచనా తర్వాత సాంకేతిక సహాయం కోసం మరో 2 మిలియన్ల యూరోలను , విద్యుత్ పంపిణీ మౌలిక సదుపాయాలకు అదనంగా ఆర్ధికసాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా నెట్వర్క్ను బలోపేతం చేయడం ద్వారా ఇళ్లకు విద్యుత్ను అందించనున్నామని వెల్లడించారు.

జగనన్న కాలనీల ఇంధన సామర్థ్య కార్యకలాపాలలో సహాయాన్ని అందించే అవకాశాలను అధ్యయనం చేయడానికి మరియు అన్వేషించడానికి అత్యంత ప్రసిద్ధ గ్లోబల్ బ్యాంక్ KfW ముందుకు రావటం సంతోషకరమని అజయ్ జైన్ అన్నారు . దీంతో ‘నవరత్నాలు పెదలందరికీ ఇల్లు’ పథకం కింద జగనన్న కాలనీలు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయని అజయ్జైన్ అభిప్రాయపడ్డారు. అందుచేత నిర్మాణ ప్రమాణాలు, ఇళ్ల నిర్మాణం లో అధిక నాణ్యతను నిర్వహించడానికి మరియు ముఖ్యమంత్రి లక్ష్యాన్ని చేరుకోవడానికి గృహనిర్మాణ శాఖ బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిందని తెలిపారు .

అయితే, గ్లోబల్ ఏజెన్సీల నుండి విదేశీ నిధులు, మద్దతుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేముందు గృహనిర్మాణ శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రితో తగు సంప్రదింపులు జరిపిన అనంతరం మాత్రమే ఆమోదం తీసుకుంటామని చెప్పారు. విద్యుత్ పంపిణీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన సవివరమైన ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) మరియు ఇంధన సామర్థ్యం మరియు గృహాల డేటాకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ఇంధన శాఖ మద్దతుతో తయారుచేస్తామని తెలిపారు. అలాగే, జూలైలో జరగబోయే సమావేశంలో ఈ అంశాలపై కేఎఫ్డబ్ల్యూ అధికారులతో పూర్తిస్థాయిలో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు.

హౌసింగ్ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా, ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, ఏపీఎస్హెచ్సీఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం శివప్రసాద్ ఇంధన సామర్థ్యంతో పాటు నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలను గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్కు అజయ్ జైన్ వివరించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం బహుశా దేశంలో బలహీన వర్గాలకు అతిపెద్ద గృహనిర్మాణ కార్యక్రమంగా నిలిచిందని తెలిపారు. లబ్ధిదారుల అవసరాలను తీర్చడానికి అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ శాఖను మంత్రి కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా దీనిని నిలిపేందుకు గృహనిర్మాణ శాఖ శాయశక్తుల పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చేస్తున్న ఈ మహాయజ్ఞంలో తలా ఒక చేయి వేయడం ద్వారా పేదవాడి స్వంత ఇంటి కల నెరవేరుతుందని చెప్పారు.

ఇటీవల వైజాగ్ లో తన పర్యటన లో కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారని అజయ్ జైన్ తెలిపారు ఇంతటి అత్యంత భారీ ప్రతిష్టాత్మకమైన గృహ నిర్మాణ ప్రాజెక్టు దేశంలోనే ఇదే మొదటిదని కేంద్ర మంత్రి చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

అంతేకాకుండా ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) మద్దతుతో పైలట్ ప్రాజెక్ట్గా కూల్ రూఫ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోందని తెలిపారు. ఇది ఇంటి పైకప్పు నుండి వేడి ప్రవేశాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. థర్మల్ సౌకర్యాన్ని కల్పిండం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల ఇళ్ల లోపల సాధారణ రూఫ్లతో పోలిస్తే ఇండోర్ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్టోగ్రతను తగ్గించవచ్చని వివరించారు. ఈ పైకప్పులు అధిక రిఫ్లెక్టివ్ ఆల్బెడో పెయింట్, హీట్ రిఫ్లెక్టివ్ టైల్స్ లేదా మెమ్బ్రేన్ వంటి అనేక రకాల పదార్థాలతో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈకూల్ రూఫ్ అప్లికేషన్ భవనంలో కూలింగ్ ఎనర్జీ లోడ్ను తగ్గించడంలో సహాయపడుతుందన్నారు. అంతేకాకుండా విద్యుత్ని ఆదా చేయవచ్చన్నారు. ఫలితంగా లబ్ధిదారులకు విద్యుత్ బిల్లులను కొంతవరకు తగ్గించడంలో ప్రయోజనం చేకూరుతుందన్నారు.

ఈ పైలట్ ప్రాజెక్టును అధ్యయనం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందిన తరువాతే రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన అన్ని హౌసింగ్ ప్రాజెక్ట్లలో అదే విధమైన ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు. లబ్ధిదారులు తమ ఇళ్లలో ఇంధన సామర్థ్య చర్యలను అనుసరించేందుకు గృహనిర్మాణ శాఖ ఇంజనీర్లు మరియు సిబ్బంది వారికి సహాయం చేస్తారని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీలలో సుమారు రూ.37 వేల కోట్లతో తాగునీరు, విద్యుత్, రోడ్లు, ఇంటర్నెట్ వంటి అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని అజయ్ జైన్ తెలిపారు. మొత్తం మంజూరైన 1348 కీలకమైన మౌలిక సదుపాయాల పనుల్లో 1023 పనులు ఇప్పటివరకు గ్రౌండ్ అయ్యాయని తెలిపారు.

గృహనిర్మాణ శాఖ పూర్తి చేసిన ఇళ్లకు శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. మీటర్ మరియు సర్వీస్ వైర్తో పాటు విద్యుత్ కనెక్షన్ను డిస్కాంలు అందించాల్సి ఉందన్నారు. డ్రెయినేజీ పనులు కూడా ప్రభుత్వమే చేపడుతుందని చెప్పారు. ఇంధన బిల్లులను ఆదా చేయడం, ఇంధన సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా కేంద్ర ప్రభుత్వ సంస్థల సమన్వయంతో ఇంధన శాఖ ద్వారా గృహాలలో ఇంధన సామర్థ్య చర్యలను ప్రవేశపెట్టాలని గృహనిర్మాణ శాఖ యోచిస్తోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రానున్న 17 వేల జగన్న్న కాలనీల్లో తాగునీటి కోసం ఇంధన సామర్థ్యపు పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నామని, అదేవిధంగా ఇంధన పొదుపు వీధి దీపాలు ఏర్పాటు చేయబోతున్నామని అజయ్ జైన్ వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *