
-విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్మెంట్.. విదేశీ విద్యా దీవెన విషయంలో వంచన
-అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసింది
-ప్రభుత్వ స్పందన కార్యక్రమం విజయవంతం అయితే ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి?
-ప్రతి సమస్యను అధ్యయనం చేసి, పరిష్కరించేలా కృషి చేస్తాం
-రాష్ట్రంలో రాక్షస పాలనను తరిమికొడదాం
-ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలి
-క్రిమినల్స్ కు వంత పాడుతున్న వైసీపీ ప్రజాప్రతినిధులు
-విజయవాడలో ‘జనవాణి’ కార్యక్రమం మొదటివారం ముగింపు సమావేశంలో జనసేన అధ్యక్షులు
పవన్ కళ్యాణ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘నేను మీ మావయ్యను.. ఏది ఒకసారి మామయ్య అనండి…’ అంటూ ముద్దులు పెట్టి మరీ పిల్లలకు మాయమాటలు చెబుతున్న ముఖ్యమంత్రి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో వారిని నిలువునా మోసం చేశారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విద్యార్థుల చదువు మధ్యలో ఫీజు రీఎంబర్స్మెంట్ సొమ్ములు ఇవ్వకుండా ఎందుకు దోబూచులాట ఆడుతున్నారు? అని ప్రశ్నించారు. ‘బాగా చదువుకోమని మాటలు చెబుతున్న మావయ్య చేతల్లో మాత్రం డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? మామయ్య డబ్బులు వేస్తాడు.. తమ చదువులు పూర్తవుతాయి అని నమ్మి విదేశీ విద్యకు వెళ్లిన విద్యార్థులు మధ్యలో ప్రభుత్వం ఉపకార వేతనం వేయకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను మావయ్య పట్టించుకోడా?’ అని నిలదీశారు. బీటెక్ చదువుతున్న తేజశ్రీ అనే విద్యార్థిని ఫీజు రీ ఎంబర్స్మెంట్ సొమ్ములు ప్రభుత్వం వేయకపోవడంతో.. కళాశాల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటనకు ఈ ముద్దుల మామయ్య ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపునయ్య ఆడిటోరియంలో చేపట్టిన ‘జనవాణి’ మొదటి వారం కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం విజయవంతం అయితే, మా వద్దకు అసలు సమస్యలు ఏవి రాకుండా ఉండాలి కదా..! మొదటివారమే మొత్తం 427 మంది తమ సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చారంటే అర్థం ఏమిటి..? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో ఇది చెబుతున్నట్లే కదా? 427 అర్జీలతో వచ్చినవారు బాధలతో, సమస్యలతో సతమతం అవుతున్న లక్షల మందికి ప్రతినిధులు వారు. మన ప్రజాప్రతినిధులకు ప్రజా సమస్యలపై తప్ప అన్ని విషయాల్లోనూ తీరిక ఉంటుంది. పుట్టిన రోజు సంబరాలకు, సదస్సులకు, బూతులు తిట్టడానికి వారికి చాలా సమయం ఉంటుంది. ప్రజా సమస్యలను తీర్చడానికి వారికి ఏమాత్రం తీరిక ఉండదు. మనం అంతా ఏకమై ఈ ప్రభుత్వాన్ని నిలదీయకపోతే ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తాం.
వారిది ఓట్ల ఆరాటం… మాది మంచి కోసం చేసే పోరాటం
ఒకరికి మేలు చేయాలన్నా, ఒక సమస్యను పరిష్కరించాలన్నా వైసీపీ నాయకులు ఎన్ని ఓట్లు పడతాయి..? వారితో మనకి లాభం ఎంత అని ఆలోచిస్తారు. జనసేన మాత్రం ఒక సమస్యను పరిష్కరిస్తే ఎంత మందికి మంచి జరుగుతుంది అని మాత్రమే కొలమానంగా తీసుకుంటుంది. ఏదైనా ఒక సమస్య కోసం గళమెత్తితే ఆయా వర్గాల ఓట్లు ఎన్ని పోతాయో.. ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆలోచిస్తున్నారు. ఒక సమస్యను అందరి దృష్టికి తీసుకువెళ్లి దానిపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే ఓట్ల రాజకీయాన్ని నేను ఆలోచించను. కేవలం ప్రజలకు మేలు జరిగితే నాకు ఓట్లు వచ్చినా రాకపోయినా విజయం సాధించినట్లే భావిస్తాను.
కీలకమైన సమస్యలు నా దృష్టికి వచ్చాయి
వచ్చిన అర్జీల్లో ఎక్కువగా వ్యవసాయం మీద, గృహ నిర్మాణం మీద, విద్య మీద వచ్చాయి. సరైన గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేక రైతులు అల్లాడుతున్నారు. టిడ్కో ఇళ్ళు ఇవ్వడానికి సైతం ప్రభుత్వానికి మనసు రావడం లేదు. లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించిన పేదలు దీని వల్ల చాలా ఇబ్బందులుపడుతున్నారు. శాంతిభద్రతల సమస్య దారుణంగా ఉంది. ఏదైనా విషయం మీద నిలదీసినా, ప్రజాప్రతినిధులను ప్రశ్నించినా ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేస్తున్నారు. పోలీస్ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారు. బంగారు భవిత ఉన్న విద్యార్థుల మీద కూడా ఇష్టానుసారం పోలీస్ కేసులు పెట్టి బెదిరించడం దారుణం. దీంతో యువత కూడా ఏదైనా ప్రశ్నించేందుకు ముందుకు రావడం లేదు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సైతం నిర్వీర్యం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లా, గురజాల నియోజకవర్గం, బ్రాహ్మణపల్లి లో సరస్వతీ పవర్ అండ్ మినరల్స్ కంపెనీ కోసం 300 ఎకరాల భూమి తీసుకొని తర్వాత వారికి కనీసం ఉపాధి కల్పించకుండా పరిహారం ఇవ్వకుండా వైసీపీ నాయకులు ఇబ్బందులుపెడుతున్నారు. చాలా ప్రాంతాల నుంచి మంచి నీరు బాగాలేదని ఫిర్యాదులు వచ్చాయి. మైలవరం, జగ్గయ్యపేట, కైకలూరు లాంటి ప్రాంతాల్లో కూడా మంచినీటి నమూనాలను ప్రజలు తీసుకువచ్చి మరీ చూపించడం బాధించింది. లక్షల కోట్లు డబ్బులు దాచుకోవడం.. దోచుకోవడం తప్ప, కనీసం ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండడం శోచనీయం.
అంతా బ్లాక్ మెయిలింగ్… బెదిరింపులు
ఈ ప్రభుత్వం కాపులకు విపరీతమైన ద్రోహం చేస్తోంది. కాపులు ఎదురు తిరిగితే కాపు కార్పొరేషన్ కు వచ్చే నిధులు ఆపేస్తామని బెదిరింపులు చేస్తున్నారు. అలాగే ముస్లిం వర్గాలకు చెందిన పథకాలను నిలుపుదల చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించడమే కాదు.. వారి సంక్షేమానికి ఉద్దేశించిన 27 పథకాలను రద్దు చేశారు. దళితులు మావైపే అని చెప్పుకొనే వైసీపీ ప్రభుత్వం వారిని వంచన చేస్తోంది. దీనిపై ఎస్సీ మేధావులు ఆలోచించాలి. అలాగే ఆటో డ్రైవర్లకు 10,000 డబ్బులు ఇచ్చి, వివిధ చలాన్ల రూపంలో అంత కంటే ఎక్కువగా డబ్బులు దండుకుంటున్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలు గుర్తుంచుకుందాం
రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలను పాలకులు గుర్తుంచుకోవాలి. ‘పేదలపై మీ ప్రేమలు, అభిమానాలు వద్దు. వారి కోసం ఉద్దేశించిన, వారి హక్కులకు సంబంధించిన చట్టాలను, రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయండి చాలు’ అన్న మాటలు నేటి పాలకులు గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలి. మీ ముద్దులు, అక్కున చేర్చుకోవడాలు వద్దు. ప్రజల సమస్యలు తీర్చండి. పదేపదే ముద్దులు పెట్టుకొనేవాళ్లను నమ్మోద్దు. మన పొరుగున ఉన్న శ్రీలంక పరిస్థితికి కారణం అక్కడ వనరులు లోపం కాదు నాయకత్వ లోపం. మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. పూర్తి స్థాయి వనరులు ఉన్నప్పటికీ నాయకత్వం మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్నదానిపైనే దృష్టి పెడుతుంది తప్ప.. ప్రజా సమస్యలు తీర్చడానికి కాదు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎలా ఇబ్బంది పెట్టాలి? ఓటర్లను తిమ్మిని బమ్మి చేసి మన వైపు ఎలా తిప్పుకోవాలి అన్న కాంక్ష తప్ప, ఏ ప్రజా ప్రయోజనం ఈ ప్రభుత్వానికి లేదు.
అద్భుతాలు చేస్తానని చెప్పను
నాకు ఒక అర్జీ ఇవ్వగానే అది పరిష్కారం అవుతుందని చాలామంది అనుకుంటారు. అది ప్రజలకు నాపై ఉన్న నమ్మకం. నేను వెంటనే అద్భుతాలు చేసేస్తాను.. అన్ని పరిష్కరిస్తాను అని చెప్పడం లేదు. కచ్చితంగా నా దృష్టికి వచ్చిన సమస్యలను పదిమంది దృష్టికి తీసుకు వెళ్లేలా ప్రయత్నిస్తాను. ఆ సమస్య విస్తృతం అయ్యేలా చూస్తాను. దీనివల్ల ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. దీంతోపాటు అధికారులు కచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేక ఫాలో అప్ ఉంటుంది. ఆ ప్రక్రియను విశ్రాంత ఐఏఎస్ అధికారి, జనసేన నాయకులు శ్రీ వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. ఒక బాధ్యతతో సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కారమయ్యేలా మాత్రం చూస్తాం. వైసీపీ నాయకులు పూర్తిగా క్రిమినల్స్ ను వెనకేసుకొచ్చే పనిలో పడ్డారు.
ఈ రోజు వచ్చిన ఓ అర్జీలో ఐదేళ్ల బిడ్డ జీవితం పాడు చేసిన ఓ అధికార పార్టీ నాయకుడిపై ఇప్పటివరకు కనీస కేసు పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించింది. కనీసం ఇచ్చిన ఫిర్యాదును తీసుకోకపోవడం మరీ విచిత్రం. క్రిమినల్స్ ను వేనకేసుకొస్తున్న ఈ పాలకులను చూస్తే మనకు ఎందుకు కోపం రావడం లేదు. మనలో ధైర్యం లేక గూండాలకు, దగాకోరులకు భయపడుతున్నారా? ఈ పద్ధతిని కచ్చితంగా జనసేన బ్రేక్ చేస్తుంది. మేం అధికారంలోకి వస్తే బలంగా లా అండ్ ఆర్డర్ ను అమలు చేస్తామని హామీ ఇస్తున్నా. తప్పు చేసిన వాడి తోలు తీసేలా శాంతిభద్రతలు ఉంటాయని మాత్రం కచ్చితంగా చెప్పగలను.
ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ హానికరం అన్నమాట నేను ఎప్పుడో చెప్పాను. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది. దీని నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి. బలమైన భావజాల సమూహం ఉన్న నాయకులంతా కలిస్తేనే మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు పునర్వైభవం వస్తుంది. జనసేన నాయకులకు చెప్పేది ఒక్కటే సమస్యల్లో ఉన్న ప్రజల కోసం నిలబడండి. కచ్చితంగా మనకు ఓటు అడిగే హక్కు వస్తుంది. నిరంతరం ప్రజలతో మమేకమై పని చేసుకొని వెళ్లడానికి అంతా సిద్ధమై ఉందాం” అన్నారు.
Prajavartha Online Telugu News