-26వ డివిజన్ 31 వ వార్డు సచివాలయం పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుల, మత, వర్గ, ప్రాంత భేదం లేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను పేదలకు చేరవేస్తున్న ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం 26 వ డివిజన్ 31 వ వార్డు సచివాలయం పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, పార్టీ శ్రేణులతో కలిసి మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వార్డు సచివాలయ పరిధిలోని 960 గృహాలలో, 312 గడపలను సందర్శించారు. ప్రజలకు అందించిన సంక్షేమంపై ఆరా తీస్తున్నప్పుడు వారి స్పందన, ప్రభుత్వం పట్ల వారికి ఉన్న ప్రేమను స్పష్టం చేస్తోందన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు వాలంటీర్లు దిక్సూచిగా వ్యవహరిస్తూ.. అండగా నిలుస్తున్నారని లబ్ధిదారులు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. దేశంలోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసి.. చెప్పిన తేదీకే లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా నగదును జమ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. అందుకు వాహన మిత్ర పథకమే ఒక చక్కని ఉదాహరణగా చెప్పుకొచ్చారు.
ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో హెల్ప్ డెస్కులపై అవగాహన
పర్యటనలో భాగంగా ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై పలువురు వృద్ధులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వివరించారు. ప్రతి ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసి ఆరోగ్య మిత్రులను నియమించినట్లు తెలిపారు. రోగులకు నాణ్యమైన వైద్యం పూర్తి ఉచితంగా, సులువుగా అందించడమే లక్ష్యంగా వీరంతా పనిచేస్తారన్నారు. వైద్యం కోసం వచ్చే రోగులకు అవసరం మేరకు ఆంబులెన్స్ సౌకర్యం కల్పించడం, అవసరమైతే వేరే హాస్పిటల్‌కు పంపించే బాధ్యత కూడా ఆరోగ్యమిత్రలదేనని పేర్కొన్నారు. దీంతోపాటు ఆయా ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో అందుబాటులోని వైద్య సదుపాయాలు, వైద్యులు, మందులపై కూడా వీరు సమాచారం అందిస్తారని తెలియజేశారు. ఎవరైనా లంచం వసూలు చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 14400 కు ఫోన్ చేయాలని సూచించారు. ఆగస్టు 1 నుంచి ఆరోగ్య శ్రీ ద్వారా అందించే చికిత్సలను పెంచుతున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడక్కడ కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
విషప్రచారానికే ప్రతిపక్షాలు పరిమితం
వరదలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న బురద రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మల్లాది విష్ణు అన్నారు. గతంలో కంటే తొందరగా ఈ ప్రభుత్వంలో వరద బాధితులకు సహాయం అందుతోందని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నట్లు స్పష్టం చేశారు. గతంలో తుఫాన్లు వస్తే మీడియా ఫోకస్ అంతా తనమీద ఉండేలా చంద్రబాబు డ్రామాలాడేవారని ఆరోపించారు. కానీ నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ ఇచ్చి అధికారులను, ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే హుదూద్, తిత్లీ తుఫాన్ల పరిహారం పేరుతో వందల కోట్లు పచ్చ నాయకులకు చంద్రబాబు దోచిపెట్టారని ఆరోపించారు. కానీ నిజమైన బాధితులకు ఈ ప్రభుత్వం వచ్చాక న్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, పారదర్శక విధానాలతో రహదారుల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతుంటే.. జనసేన మాత్రం పనిగట్టుకుని విష ప్రచారం చేస్తోందని మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆర్ అండ్ బీ రోడ్లను బాగుచేయడం కోసం దాదాపు రూ. 2,500 కోట్లు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి చేసిన పనులకు రూ.800 కోట్ల మేర బిల్లులను ఇప్పటికే కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగిందన్నారు. అలాగే వర్షాల కారణంగా అక్కడక్కడ దెబ్బతింటున్న రోడ్లను సైతం వెనువెంటనే పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పాలనకు మెచ్చి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని జాతీయ రహదారుల ప్రాజెక్టులను మన రాష్ట్రానికి మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. అయినా కూడా ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులపై విమర్శలు గుప్పించే ముందు.. విజయవాడ-నూజివీడు రహదారిని ఓసారి పరిశీలించాలని జనసేన నాయకులకు సూచించారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన చేస్తున్న విష ప్రచారాలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, ఏఈ(ఇంజనీరింగ్) వెంకటేష్, డివిజన్ కోఆర్డినేటర్ కోలా నాగాంజనేయులు, నాయకులు చలసాని వెంకటేశ్వరరావు, భోగాది మురళి, శంకర్, పసుపులేటి కోటేశ్వరరావు, పారా ప్రసాద్, బాడిత వెంకట్రావు, రమణ, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News