Breaking News

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సమూలంగా మార్చిన ‘నవరత్నాలు’: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-27వ డివిజన్ 199 వార్డు సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సమూలంగా మార్చివేశారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం 27 వ డివిజన్ 199 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. దుర్గాపురంలోని సాంబమూర్తిరోడ్డు, ఇడుపుగంటి లక్ష్మణరావు వీధి, నందమూరి నరసింహారావు వీధి, రాజీవ్ గాంధీ రోడ్డు, గణపతి వారి వీధులలో విస్తృతంగా పర్యటించి ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. వార్డు సచివాలయ పరిధిలోని 1,224 గృహాలలో, 210 గడపలను సందర్శించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయా లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు మూడేళ్లలో రూ.1.41 లక్షల కోట్ల సంక్షేమాన్ని డీబీటీ పద్ధతిలో అందించడం జరిగిందని తెలిపారు. నాన్ డీబీటీ ద్వారా రూ. 40 వేల కోట్ల లబ్ధి చేకూరినట్లు వివరించారు. మరోవైపు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సాంబమూర్తిరోడ్డులో అర్థరాత్రుళ్లు అల్లరి మూకల ఆగడాలతో ఇబ్బందులకు గురవుతున్నట్లు దుకాణదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. వరుస ఘటనలకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసి దోషులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో గస్తీ పెంచడంతో పాటు.. స్టేషన్‌ అధికారి బీట్స్‌ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

పేదలకు సొంత ఇల్లు జగనన్న స్వప్నం
పేదలందరూ ఆత్మగౌరవంతో సొంత ఇంటిలో సంతోషంగా జీవించాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. లబ్ధిదారులపై ఒక్క పైసా భారం పడకుండా ప్రభుత్వమే పూర్తిఖర్చుతో నిర్మించే ఆప్షన్‌–3 ఇళ్లను వేగంగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారన్నారు. నున్న, సూరంపల్లి, కొండపావులూరు జగనన్న కాలనీలలో తొలిదశ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నట్లు వివరించారు. కానీ పేదలకు ఉచితంగా ఇళ్ళ స్థలాలు కేటాయించడాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు న్యాయస్థానాల ద్వారా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిలో నిలిచిపోయిన 9వేల ఇళ్ల నిర్మాణాలే ఇందుకు నిదర్శనమన్నారు. నీడలేని ప్రతి పేదవాడికి సొంత గూడు కల్పించాలనే ఉద్దేశంతో జగనన్న ఆలోచన చేస్తుంటే.. పేదల ఆకాంక్షలకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారని వ్యాఖ్యానించారు. వీరందరికీ వీలైనంత త్వరలో భూమి కొని ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

జీవీఎల్ కాదు.. అబద్ధాల నరసింహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. బీజేపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పైగా ప్యాకేజీ అమలులో ఉన్నట్లు జీవీఎల్ నరసింహరావు వంటి వారు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగువారై ఉండి ప్రత్యేక హోదాను జీవీఎల్ అడ్డుకుంటున్నారని.. కేంద్ర హోంశాఖ కమిటీ అజెండాలో హోదా అంశాన్ని తీయించే వరకు ఆనాడు జీవీఎల్ కు నిద్రపట్టలేదని గుర్తుచేశారు. ఏపీకి ఎప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదనేది అబద్దాల నరసింహం స్టాండా..? సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు తెల్లరేషన్ కార్డుదారులకు అందిస్తున్న రేషన్ సరుకులను 29 శాతానికి తగ్గించి కేంద్ర ప్రభుత్వం పేదల కడుపు కొడుతోందని మల్లాది విష్ణు విమర్శించారు. మిగిలిన లబ్ధిదారులకు సొంత ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వమే రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, నాయకులు కురిటి శివ, బొప్పన గాంధీ, పిల్లుట్ల వంశీ, మందా రాము, లంకా కుమార్, శీలం భవానీ రెడ్డి, దుర్గారావు, కూనపురెడ్డి అనిల్, పసుపులేటి బుచ్చిబాబు, లక్ష్మారెడ్డి, రవిచంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *