-58వ డివిజన్ 255 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే ఆదర్శ పాలనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మంగళవారం 58 వ డివిజన్ 255 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, అధికారులు, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వడ్డెర కాలనీలోని వీధులలో విస్తృతంగా పర్యటించి.. 252 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా మూడేళ్లలో ప్రభుత్వం చేసిన మంచితో పాటు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను వివరించారు. ప్రజలకు అందించిన సంక్షేమాన్ని బుక్ లెట్ల ద్వారా తెలియజేశారు. ప్రజా సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. త్రాగునీరు, డ్రెయిన్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రజలందరికీ అనువైన సమయాలలో త్రాగునీరు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. డ్రెయిన్లు పొంగకుండా ఎప్పటికప్పుడు సిల్ట్ మెషిన్ల ద్వారా ఎత్తివేయాలన్నారు. అలాగే కూలిన సైడ్ కాలువలను తిరిగి నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. శానిటరీ సెక్రటరీలు ఖచ్చితంగా టూర్ డైరీ ఫాలో అవ్వాలని.. క్షేత్రస్థాయి పరిశీలనలకు సంబంధించిన వివరాలు, ప్రజాభిప్రాయాలను డైరీలో పొందుపరచాలని ఆదేశించారు.
సచివాలయ పరిధిలో రూ.4.11 కోట్ల సంక్షేమం
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 255 వ వార్డు సచివాలయ పరిధిలో ఇప్పటివరకు రూ. 4.11 కోట్ల సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 307 మందికి ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీన ఇంటి వద్దకే పింఛన్ అందజేస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 366 మందికి రూ. 47.58 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 63 మందికి రూ. 9.45 లక్షలు., కాపునేస్తం ద్వారా 10 మందికి రూ. 1.50 లక్షలు., చేయూత ద్వారా 97 మందికి రూ. 18.18 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 10 మందికి రూ. 1.50 లక్షలు., వాహనమిత్ర ద్వారా 24 మందికి రూ. 2.40 లక్షలు., చేదోడు ద్వారా రూ. 10 వేల చొప్పున 10 మందికి రూ. లక్ష ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. డివిజన్ లో అభివృద్ధికి సంబంధించి గడిచిన మూడేళ్లలో రూ. 11.09 కోట్ల విలువైన పనులు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఇందులో రూ. 2.74 కోట్ల పనులు పూర్తి కాగా.. రూ. 3.09 కోట్ల పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. మరో 5.26 కోట్ల పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలియజేశారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా డివిజన్లో 27 మందికి రూ. 18.40 లక్షల సాయాన్ని అందించినట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
పవన్ వి ఉత్తర కుమార ప్రగల్భాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని మంచి పనులు చేస్తున్నా ఆయనను ద్వేషించడమే పవన్ కళ్యాణ్ సిద్ధాంతమని.. కేవలం వైఎస్సార్ సీపీని ప్రశ్నించటానికే ఆయన పార్టీని పెట్టారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ ఎప్పుడూ జగన్ గారి మీద, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం ఆయనకు అలవాటు మారిపోయిందన్నారు. కనీసం చిత్తశుద్ధి, అవగాహన, ఒక సిద్ధాంతం లేకుండా జనసేన అధినేత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఒక స్థిరత్వం లేని వ్యక్తి అని.. మొన్నొక మాట, నిన్నొక మాట, రాయలసీమకు వచ్చి మరో మాట మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కనుకనే ఆయన మాట్లాడే మాటలను ప్రజలు ఏరోజుకారోజు మర్చిపోతారని చెప్పారు. పోటీచేసిన రెండు చోట్ల ఘోర పరాజయం పాలైన పవన్.. 151 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించిన వైసీపీపై విమర్శలు గుప్పించడం హాస్యాస్పదమన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలందరూ జగనన్న వెంట ఉంటే.. టీడీపీ నేతలు మాత్రం తప్పుడు సర్వేలతో ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. తెలుగుదేశం నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై రెండు కళ్ల సిద్ధాంతాన్ని వీడి.. స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ, ఎప్పటికీ వైఎస్సార్ సీపీకి ఎదురేలేదని, ప్రజాదరణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరెవరూ సాటిరారని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ(వాటర్ & యూజిడి) రామకృష్ణ, ఏఎంహెచ్ఓ రామకోటేశ్వరరావు, వైసీపీ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, పొదిలి శైలజా, శర్మ, తోపుల వరలక్ష్మి, మారుతి, లక్ష్మణరావు, గోవింద్, అలంపూర్ విజయ్, ఉమ్మడి వెంకట్రావు, ఇసరపు రాజారమేష్, బంకా భాస్కర్, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News