విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా టంగుటూరు ప్రకాశం పంతులు జీవితం ఎంతో ఆదర్శనీయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మంగళవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రకాశం పంతులు అతి సామాన్య కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ పిలుపుతో తన న్యాయవాది వృత్తిని విడిచి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారన్నారు. వందేమాతరం, స్వదేశీ ఉద్యమ సమయాల్లో అనేక సభలకు అధ్యక్షత వహించారన్నారు. దేశం కోసం న్యాయవాద వృత్తిని విడిచి, ఆర్జనను ప్రజలకు పంచిపెట్టిన ప్రకాశం స్ఫూర్తి ఈతరం యువతకు ఆదర్శనీయమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆయన ప్రారంభించిన స్వరాజ్య పత్రిక స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఆంధ్ర ప్రజల ఆకుంటిత ధైర్యసాహసాలకు, అసమాన త్యాగనిరతికి టంగుటూరి మారుపేరుగా నిలిచారని.. తెల్లవాడి తూటాకు గుండెను చూపిన ధీశాలి అని కొనియాడారు. స్వాతంత్ర్యం సాధించటంలో, పాలనదక్షతలో ఎంతో ఆదర్శవంతంగా నిలిచారన్నారు. మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయిన తరువాత తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. 1952లో భారీ వరదలు వచ్చిన సమయంలో పార్లమెంటులో పోరాడి ప్రభుత్వ నిధులతో కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణానికి పూనుకున్నారన్నారు. 1954 న సీఎం హోదాలో బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో.. బ్యారేజీకి ఆయన పేరు పెట్టారని తెలిపారు. ఆ మహనీయుని ఆదర్శాలే స్ఫూర్తిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఆయన బాటలోనే పయనిస్తోందని వ్యాఖ్యానించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో 33వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, నాయకులు కొప్పవరపు బలరామకృష్ణమూర్తి, వై.లోకనాథశర్మ, దోనేపూడి శ్రీనివాస్, ఒగ్గు విక్కీ, చల్లా సుధాకర్, చాంద్, పులపా కృష్ణ, మైలవరపు రాము, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News